గుంటూరు బాలిక మిస్సింగ్ కేసు.. డీజీపీపై హైకోర్టు సీరియస్
Åడీజీపీనే బాలికను తేవాలంటూ ఆదేశం
కిరణం, (అమరావతి): మూడు నెలల కిందట గుంటూరులో పదో తరగతి బాలిక అదృశ్యంపై కేసు నమోదయింది. అయితే, బాలికను ఒక వ్యక్తి తీసుకెళ్లా డంటూ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇటీవల తమను పట్టుకోలేరంటూ ఆ వ్యక్తి పోలీసులు, బాలిక తల్లిదండ్రులకు సవాల్ విసరాడు. దాంతో బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ఒకరోజు బాలికను హాజరుపరచాలంటూ నేరుగా డీజీపీనే బాలికను తీసుకురావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, డీజీపీ సిట్ ఏర్పాటు చేయడంపై హైకోర్టు తప్పుబట్టింది. డీజీపీకి కేసు ఎలా విచారించాలో తాము చెప్పే స్థితికి తీసుకురావొద్దంటూ ధర్మాసనం ఘాటుగా స్పందించింది. దాంతో ఇప్పుడు ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
గుంటూరు పట్టాభిరామపురం పోలీస్ స్టేషన్లో జూన్ 10వ తేదీన ఒక ఫిర్యాదు నమోదైంది. పదో తరగతి చదువుతున్న తన కూతురు ట్యూషన్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదంటూ ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు తన కూతురుని తీసుకెళ్లా డంటూ తండ్రి ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ బాలిక ఆచూకీ కనుగొనలేకపోయారు. దీనిపై బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించగా.. 24 గంటల్లో బాలికను కనిపెట్టి ధర్మాసనం ఎదుట హాజరుపరచాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే, హైకోర్టు ఆదేశాలపై డీజీపీ వైఖరిపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి 24 గంటల్లో బాలికను కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తే సిట్ వేసి చేతులు దులుపుకొంటారా అంటూ నేరుగా డీజీపీని హైకోర్టు ప్రశ్నించింది. ప్రధాని నరేంద్ర మోదీ 75 ఏళ్ల వయస్సులో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయస్సులో దేశ, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతుంటే.. మీరు ఒక బాలిక ఆచూకీ కనుగొనలేకపోయారా అంటూ డీజీపీ, పోలీసులను ఉద్దేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ తుహిన్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
బుధవారం హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి గురువారం బాలికను హాజరుపరచాలంటూ హైకోర్టు ఆదేశించింది. దాంతో గురువారం విచారణ ప్రారంభం కాగానే ఎస్‌జీపీ తిరుమాను విష్ణుతేజ మాట్లాడుతూ బాలిక ఆచూకీ కనిపించలేదని, ఈ వ్యవహారంపై డీజీపీ సిట్ ఏర్పాటు చేశారని, బాలిక అదృశ్యం కేసును కిడ్నాప్ కేసుగా మార్చారంటూ తెలిపారు. సిట్ సభ్యుల వివరాలను కూడా కోర్టుకు అందజేశారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం అభ్యంతరం తెలుపుతూ బాలిక ఆచూకీపై గుంటూరు ఎస్పీని డీజీపీ నివేదిక కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒకే కాలుతో గెంతుతూ స్కూల్‌కు 7 ఏళ్ల పాప.. వైరల్ అవుతోన్న చిన్నారి పోరాటం
డీజీపీ స్వయంగా రంగంలోకి దిగి సిబ్బందిని పరిగెత్తిస్తే ఆ బాలిక ఆచూకీ వెంటనే కనుక్కోవచ్చని ధర్మాసనం పేర్కొంది. బాలిక ఆచూకీ కనుక్కోవడంలో విఫలమైన పట్టాభిపురం ఠాణాలో పనిచేసే ఎక్కువమంది పోలీసులకు సిట్‌లో స్థానం కల్పించడం ఏంటని ప్రశ్నించింది. ఈ కేసును డీజీపీ తేలికగా తీసుకున్నట్లున్నారని.. కేసు దర్యాప్తు ఎలా చేయాలో కోర్టు చెప్పే పరిస్థితి కల్పించుకోవద్దని హితవు పలికింది. డీజీపీ నుంచి ఇలాంటి తీరును తాము ఆశించలేదని, డీజీపీని నేరుగా కోర్టుకు పిలపించేందుకు సిద్ధమైంది. ఎస్‌జీపీ విష్ణుతేజ స్పందిస్తూ బాలిక ఆచూకీ కనుగొనేందుకు తీవ్ర కృషి చేస్తున్నారని, సోమవారం బాలికను కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు. దాంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.