మీరు నా ఓటర్లు కాదు.. మీ సమస్యలను వినను
Åబీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, విపక్షాలు
ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాగా.. పొరుగున నియోజకవర్గానికి చెందిన ప్రజలు తమ సమస్యలను చెప్పుకోడానికి వచ్చారు. నీటి ఎద్దడి, కరెంట్ కోతలపై తమ గోడును వెళ్లబోసుకోడానికి వస్తే.. మీరు నాకు ఓటేసినవారు కాదంటూ సదరు ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా మాట్లాడారు. మీ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లండని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన జనం.. వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనను అక్కడున్న ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్షర కిరణం, (మధ్యప్రదేశ్/జాతీయం): మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. తన పొరుగు నియోజకవర్గానికి చెందిన గ్రామస్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి రాగా... వారితో ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. “తనకు ఓటు వేసిన వారు కాదంటూ” వారి సమస్యలను వినడానికి ఆయన నిరాకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి నిరసనగా.. ఎమ్మెల్యే కారు బోనెట్‌పై తన చేతిలో ఉన్న చిన్న పాపను పడుకోబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శివపురి జిల్లా నర్వార్ తహసీల్‌లోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భవన్లో కరేరా బీజేపీ ఎమ్మెల్యే రమేష్ ఖతిక్ గురువారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం... కాంగ్రెస్ ఎమ్మెల్యే కైలాష్ కుష్వా ప్రాతినిధ్యం వహిస్తున్న పోహ్రి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నానక్పూర్, బర్ఖాదీ గ్రామాల ప్రజలు తాగునీటి ఎద్దడి, నిరంతర విద్యుత్ కోతలపై ఫిర్యాదులు చేయడానికి వచ్చారు.
అయితే, వారి అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే ఖతిక్... తన పక్క నియోజకవర్గానికి చెందినవారని, తన ఓటర్లు కాదంటూ వారి సమస్యలను వినడానికి ఆయన నిరాకరించారని గ్రామస్థులు ఆరోపించారు. తమ ఎమ్మెల్యేనే సంప్రదించాలని తమకు చెప్పినట్లు వారు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. తాము ఒక నిర్దిష్ట ఎమ్మెల్యే వద్దకు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరడానికి వచ్చామని వాదించారు. “మేము మా సమస్యలతో ప్రభుత్వం వద్దకు వచ్చాం... మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే. కనీసం మా మాట వినండి” అని కొందరు అనడం వైరల్ అవుతోన్న వీడియోలలో వినిపిస్తోంది.
ఈ ఘర్షణ తీవ్రం కావడంతో ఓ గ్రామస్థుడు తన మూడు-నాలుగేళ్ల చిన్నారిని ఎమ్మెల్యే కారు బోనెట్‌పై పడుకోబెట్టి “మీరు మా సమస్యలను విననప్పుడు, మా పిల్లలను కూడా మీతోనే తీసుకెళ్లండి” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ ఉన్నవారు ఆ బిడ్డను కారుపై నుంచి పక్కకు దించారు. దీంతోఅక్కడ కాసేపు తీవ్ర గందరగోళానికి దారితీయగా.. అధికారులు, స్థానికులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.