శ్రీసిటీలోని పరిశ్రమలో పేలుడు.. నలుగురు కార్మికుల మృతి
అక్షర కిరణం, (తిరుపతి): తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. మందుల తయారు చేసే టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో ఒక్కసారిగా బాయిలర్ పేలి మంటలు చెలరేగి నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో నైట్ షిఫ్ట్‌లో ఉన్న ఇద్దరు కార్మికులు అక్కడికక్కడమే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.. వారిద్దరు అక్కడ చనిపోయారు. మృతుల్ని తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చెరివికి చెందిన చిన్న మస్తాన్, తమిళనాడులోని మాదరపాకానికి చెందిన రమేష్, తమిళనాడుకు చెందిన మోహన్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌరబ్ రాయ్‌గా గుర్తించారు. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు పరిశ్రమ దగ్గరకు చేరుకున్నాయి. అక్కడ సహాయక చర్యలు ప్రారంభించారు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి వెంటనే ఆస్పనత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తడకు చెందిన మరో కార్మికుడు వాసు పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు జరిగిన సమయంలో పరిశ్రమలో సుమారు 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తొలుత శ్రీసిటీ ఆసుపత్రికి తరలించి, పరిస్థితిని బట్టి మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఈ టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.
తిరుపతి జిల్లా శ్రీ సిటీ లోని ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాయిలర్ పేలిన సమయంలో ఘటనా స్థలంలోనే ఇద్దరు చనిపోయారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చికిత్స కొనసాగుతోందని వివరించారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
జోగులాంబ గద్వాలలో ఘోర ప్రమాదం.. బోల్తా పడిన స్కూల్ బస్సు
తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెడిసిన్స్ తయారు చేసే ఈ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో విధుల్లో ఉన్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు అధికారులు వివరించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
శ్రీసిటి ప్రైవేటు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరుతున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
తిరుపతి శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటనలో గాయపడినవారంతో త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శ్రీసిటీకి బయల్దేరి వెళ్లారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.