తునిలో బాలికపై అత్యాచారయత్నంపై మహిళా కమిషన్ ఆగ్రహం
కనిందితుడిపై చర్యలు తీసుకోండి కకాకినాడ ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కబాలికలు, మహిళల భద్రతకు ఆటంకం కలిగితే కఠిన చర్యలు
అక్షర కిరణం, (అమరావతి): కాకినాడ జిల్లా తునిలో బాలికల గురుకుల విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంధువునంటూ విద్యార్ధినిని పాఠ శాల నుంచి తోటల్లోకి తీసుకెళ్ళి వేధించిన కీచకుడి ఉదంతం బుధవారం సోషల్ మీడియాలో దుమారం రేగింది. దీనిపై తక్షణమే స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. ఆ కీచకుడి భరతం పట్టాలని కోరారు. ఈ ఉదంతంపై కమిషన్ సుమోటోగా కేసును స్వీకరిస్తున్నట్లు కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ చెప్పారు. కేసు దర్యాప్తును వేగవంతంగా నిర్వహించాలని, నిందితుడి పై పోక్సో చట్టం కింద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలికలపై ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడిన ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని చెప్పారు. బాధిత బాలికకు తక్షణ రక్షణ, వైద్య సహాయం, చట్టపరమైన మద్దతు అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి నివేదికను 48 గంటల్లోగా కమిషన్కు సమర్పించాలంటూ జిల్లా పోలీసు శాఖకు నోటీసు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా గురుకుల పాఠశాలల్లో భద్రతా చర్యలను కఠినతరం చేయాలని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీకు లేఖలలో సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు విరుద్ధమైన ఏ చర్యలైనా కమిషన్ సహించదని, నిందితులకు కఠినమైన శిక్ష విధించేలా న్యాయ ప్రక్రియను పర్యవేక్షిస్తామని ఆమె స్పష్టం చేశారు.