సినిమా ఆడిషన్ పేరుతో 17 మంది పిల్లలను కిడ్నాప్ చేసిన సైకో
కసైకో రోహిత్ ఆర్యాను కాల్చి చంపిన పోలీసులు
అక్షర కిరణం, (ముంబై/జాతీయం): మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పిల్లలను కిడ్నాప్ చేశాడు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని పేర్కొంటూ.. కొంత మంది పిల్లలను ఆడిషన్‌కు పిలిచాడు. అలా 17 మంది పిల్లలు రాగా.. వారిని బంధించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసు లు.. రంగంలోకి దిగి ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని ఒప్పించి.. వారిని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ వ్యక్తి పిల్లలను వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. తాను డబ్బుల కోసం ఈ పని చేయలేదని.. అంతే కాకుండా తానేమీ ఉగ్రవాదిని కాదని పేర్కొన్నాడు. ఎలా గోలా ఆ భవనంలోకి చేరుకున్న పోలీసులు పిల్లలను కాపాడే ప్రయత్నం చేయగా.. నిందితుడు కాల్పులు జరిపాడు. పోలీ సులు కూడా కాల్పులు జరపగా అందులో హతమయ్యాడు.
ముంబైలోని పోవాయి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఆర్ఏ స్టూడియోస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ ఆర్య 17 మంది పిల్లలను బందీగా పట్టుకున్నాడు. సినిమా ఆడిషన్ కోసం ఆ స్టూడియోకి వచ్చిన పిల్లలను కిడ్నాప్ చేశాడు. అయితే కిడ్నాప్‌కు ముందు విడుదల చేసిన ఒక వీడియోలో.. తనను తాను రోహిత్ ఆర్యగా ఆ నిందితుడు పరిచయం చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకోవడాకి బదులుగా పిల్లలను కిడ్నాప్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
ఇతరులతో సాధారణంగా మాట్లాడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. తనకు సాధారణ, నైతిక, ధార్మిక డిమాండ్లు, కొన్ని ప్రశ్నలు ఉన్నాయని తెలిపాడు. తాను ఎవరి నుంచి డబ్బు డిమాండ్ చేయలేదని.. తాను టెర్రరిస్టును కానని స్పష్టం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులకు మధ్యాహ్నం 1:45 గంటలకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల బృందం నిందితుడు రోహిత్ ఆర్యతో చర్చలు ప్రారంభించింది.
కానీ పిల్లలను విడుదల చేయడానికి రోహిత్ ఆర్య నిరాకరించాడు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు బాత్రూమ్ ద్వారా బలవంతంగా లోపలికి ప్రవేశించి పిల్లలను రక్షించారు. పిల్లలను రెస్క్యూ చేస్తున్న సమయంలో.. ఎయిర్ గన్‌తో రోహిత్ ఆర్య.. పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీనికి ప్రతిగా.. పోలీసులు కూడా ఒక రౌండ్ కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు రోహిత్ ఆర్య గాయపడ్డాడు. దీంతో అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే మరణించాడు. సంఘటన స్థలం నుంచి పోలీసులు ఎయిర్ గన్, కొన్ని రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో కిడ్నాప్ అయిన పిల్లలు అందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కిడ్నాప్‌కు వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని.. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడిరచారు.