ఎన్నికల కమిషనర్ల ఎంపిక నుంచి సీజేఐని ఎందుకు మినహాయించారు?
కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో సీజేఐని తొలగించి.. ప్రధాని ప్రాతినిధ్యం వహించే త్రీసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించడంపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరిపింది. 2:1 నిష్పత్తితో కూడిన ఈప్రక్రియలో పారదర్శకత స్పష్టంగా కనిపించాల్సిన అవసరం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2023 నూతన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదు గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా వద్దా అనే అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని మినహాయిస్తూ పార్లమెంట్ తీసుకొచ్చిన నూతన చట్టం చెల్లుబాటుపై సుప్రీం కోర్టులో తీవ్రస్థాయి వాదనలు జరిగాయి. ప్రధాన నియామక ప్రక్రియలో పారదర్శకత ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ఎంపిక విధానంలో నిష్పాక్షికత స్పష్టంగా కనిపించాల్సిన అవసరం ఉందో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాదనలు పూర్తయిన అనంతరం.. ఈ రాజ్యాంగపరమైన సవాలును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా వద్దా అనే అంశంపై సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
ఎంపిక విధానంలో 2:1 నిష్పత్తిపై ప్రశ్నలు
2023లో ఆమోదించిన నూతన చట్టం ప్రకారం.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే త్రీసభ్య కమిటీలో ప్రధాని, ప్రధాని ప్రతిపాదించిన ఒక కేంద్ర మంత్రి, లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఈనిబంధనపై విచారణ సందర్భంలో జస్టిస్ దత్తా స్పందిస్తూ.. ‘ఎన్నికల కమిషనర్ పూర్తిగా స్వతంత్రం గా వ్యవహరించాలి. కమిటీలో నిష్పాక్షికత సాధిస్తున్నారా లేదా అనేదాని కంటే.. అది బాహ్య ప్రపంచానికి స్పష్టంగా కనిపించాలి కదా?” అని వ్యాఖ్యానించారు. ఎంపిక ప్రక్రియలో ప్రధాని వర్గం నుంచి ఇద్దరు, ప్రతి పక్షం నుంచి ఒకరు ఉండటంతో నిష్పత్తి 2:1గా మారుతోందని ధర్మాసనం పేర్కొంది. తాము ప్రధానిని అపనమ్మకంతో చూడడం లేదని, అయితే వ్యవస్థలో పార దర్శకత కొరవడుతోం దని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ చట్టాన్ని సమర్థించారు. ప్రధాని పదవికి ఎంతో ప్రాధాన్యత, పవిత్రత ఉంటాయని.. ఎంపిక కమిటీలో మెజారిటీ ఉందనే కారణంతో ప్రధాని లేదా మంత్రులు దురుద్దేశంతో వ్యవ హరిస్తారని అనుకోవడం పొరపాటని పేర్కొన్నారు. ప్రధాని నిర్ణయాలను నమ్మకపోతే.. చివరకు కేంద్ర క్యాబినెట్ మంత్రు లను ఎంచుకోవడానికి కూడా ఏదైనా రిటైర్డ్ న్యాయమూర్తిని లేదా బయటి వ్యక్తిని సంప్ర దించాలనే నిబంధన పెట్టాల్సి వస్తుం దని వాదించారు. ఈ అంశం రాజ్యాంగ వివరణకు సంబంధిం చిన ప్రాథమిక చట్టపరమైన ప్రశ్నతో కూడుకున్నది కాబట్టి.. ఆర్టికల్ 145(3) ప్రకారం ఈ వ్యవహారాన్ని పెద్ద బెంచ్‌కు నివేదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
న్యాయ వ్యవస్థ నియామకాలపై చర్చ..!
న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులే న్యాయమూర్తులను ఎన్ను కుంటున్నప్పుడు.. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో బయటి వ్యక్తుల జోక్యం ఎందుకనే అంశాన్ని తుషార్ మెహతా లేవనెత్తారు. ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉండేది కేవలం కార్యనిర్వా హక వ్యవస్థ, శాసన వ్యవస్థ మాత్రమేనని గుర్తు చేశారు. 2023 డిసెంబర్ కంటే ముందు సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో.. ప్రధాని, ప్రతిపక్ష నేతలతో పాటు సీజేఐ కూడా ఎంపిక కమిటీలో ఉండాలని పేర్కొంది. పార్లమెంట్ తీసుకొచ్చిన నూతన చట్టంలో సీజేఐని తొలగించడాన్ని సవాలు చేస్తూ ప్రజా హిత పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ చిక్కుముడులపై స్పష్టత ఇచ్చేందుకు వ్యవహారాన్ని విశాల ధర్మాసనానికి పంపాలా వద్దా అనే నిర్ణయాన్ని కోర్టు త్వరలో వెలువరించనుంది.