వాళ్లు అంగీకరించాకే బొత్స మేనల్లుడిని పార్టీలోకి తీసుకున్నాం
Åఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు
అక్షర కిరణం, (విశాఖపట్నం): బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరికపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. స్థానిక టీడీపీ నాయకత్వం అంగీకారం తీసుకున్న తర్వాతే చిన్న శ్రీనును పార్టీలోకి చేర్చుకున్నామని తెలిపారు. పార్టీలోకి ఎవరైనా రావా లంటే స్థానిక నాయకత్వం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసు కుంటామని చెప్పారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చర్చల అనంతరం సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారా యణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను పార్టీలో చేర్చుకోవడంపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక టీడీపీ నాయకత్వం అంగీకారం తీసుకున్న తర్వాతే చిన్న శ్రీనును పార్టీలోకి చేర్చుకున్నామని స్పష్టం చేశారు. పార్టీలోకి ఎవరైనా రావాలంటే స్థానిక నాయకత్వం అభిప్రాయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. విశాఖపట్నంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు.. చిన్న శ్రీను టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీనును స్థానిక నాయకత్వం ఆమోదంతోనే పార్టీలోకి తీసుకున్నామని చెప్పారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలు, నిర్ణయా లకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘సముద్రంలో నదులు కలవవని.. నదులే సముద్రంలో కలవాలి’ అంటూ పార్టీలో చేరే వారు టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సిందేనని పల్లా పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనా పల్లా శ్రీనివాసరావు స్పందించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూర్చొని సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. స్థానిక సంస్థల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.
జిల్లా స్థాయిలో సమావేశాల తర్వాత అసెంబ్లీ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏపీ టీడీపీ చీఫ్ వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసు కుందని గుర్తు చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో మరిన్ని అవకాశా లు లభించనున్నాయన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యతను దెబ్బ తీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక తమ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
కూటమి నేతలు, కార్యకర్తల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి.. ఒక పార్టీ నాయకులుగా మరో మిత్రపక్షానికి చెందిన నేతలపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయిస్తున్నారని పల్లా ఆరోపించారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి పోస్టును నిజమని నమ్మి టీడీపీ శ్రేణులు వెంటనే స్పందించవద్దని సూచించారు. కూటమిలోని ఏ పార్టీ నాయకుడి నుంచి అభ్యంతరకర వ్యాఖ్యలు వచ్చినా.. ఆ విషయాన్ని నేరుగా సోషల్ మీడియాలో స్పందించకుండా పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
డీఎస్సీ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని పల్లా శ్రీనివాస రావు విమర్శించారు. ఏపీపీఎస్సీకి సంబంధించిన అంశాల్లో అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని పల్లా సవాల్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా కేవలం సంతకాలు చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే స్పీకర్ డిజిటల్ సైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారని పల్లా శ్రీనివాసరావు గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన పదవులకు న్యాయం చేయాలంటే శాసనసభకు హాజరై చర్చల్లో పాల్గొనాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా రాష్ట్ర అభివృద్ధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, మంత్రి నారా లోకేశ్ చొరవతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.