విశాఖలో త్వరలోనే 16 ఫైవ్ స్టార్ హోటళ్లు
Åమంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖలో త్వరలో 16 ఫైవ్ స్టార్ హోటళ్లు రానున్నాయని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త హోటళ్ల ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న.. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (వీSవీజు) బిజినెస్ ఎక్స్పో-2026ను మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు.
3 రోజుల ఈ బిజినెస్ ఎక్స్‌పోలో 180కి పైగా ఎగ్జిబిటర్లు, 60కి పైగా స్టార్టప్‌లు, 50 ఆర్థిక సంస్థలు పాల్గొననున్నాయి.
రాష్ట్రంలో స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మైక్రో పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. వ్యాపారాల ఏర్పాటుతో పాటు వాటి విస్తరణకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.
ఇప్పటికే పర్యాటక కేంద్రంగా విశాఖ ప్రత్యేక గుర్తింపు పొందిందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. త్వరలో 16 ఫైవ్ స్టార్ హోటళ్లు రానున్నాయని.. ఈ హోటళ్ల ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. హోటళ్లు, ఆతిథ్య రంగం అభివృద్ధి చెందితే విశాఖకు వచ్చే దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖను పర్యాటక, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొత్త హోటళ్లు, వ్యాపార సంస్థలు, పర్యాటక మౌలిక వసతులు ఏర్పడటం వల్ల స్థానికంగా ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు బిజినెస్ ఎక్స్పో-2026 విశాఖపట్నంలో జరగనుంది. ఇవాళ ప్రారంభమైన ఈ ఎక్స్పో.. ఈనెల 13వ తేదీ వరకు బీచ్‌రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్‌లో నిర్వహిస్తున్నారు. కనెక్ట్-బిల్డ్-గ్రో అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో ఎంఎసఎంఈలు, స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒకే వేదికపైకి రానున్నాయి. ఈ బిజినెస్ ఎక్స్పో-2026లో 180కి పైగా ఎగ్జిబిటర్లు, 60కి పైగా స్టార్టప్‌లు, 50 ఆర్థిక సంస్థలు పాల్గొంటాయని నిర్వాహకులు వెల్లడించారు. దాదాపు 50 వేల మంది వ్యాపార సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్, ఫ్యాబ్రికేషన్, టూరిజం, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్స్, ప్రభుత్వ విభాగాలు, బ్యాంకింగ్-పీఎస్‌యూ రంగాలకు సంబంధించి మొత్తం 8 ప్రత్యేక పెవిలియన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్స్‌పోలో పారిశ్రామిక నిపుణులతో ప్రత్యేక సెమినార్లు నిర్వహించ నున్నారు. వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారుల మధ్య బీ2బీ, వ్యాపార సంస్థలు-ప్రభుత్వ విభాగాల మధ్య బీ2జీ సమావేశాలు జరగను న్నాయి. ఉత్తరాంధ్రలో వ్యాపార అవకాశాలను వివరించే బిజినెస్ డైరెక్టరీని కూడా ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.