విశాæఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్ప్రెస్లు ప్రారంభం
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు 20 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం రోజు బస్సులు ప్రారం భించగా.. నేటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఏఎస్సార్ -1, ఏఎస్సార్ 2 పేర్లతో రెండు రూట్లలో ఈ బస్సుల్ని నడిపిస్తున్నారు. టికెట్ ధరల్ని కూడా ఖరారు చేశారు. ప్రతి అర గంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి భోగాపురానికి వచ్చింది.. అధికారులు ప్రయాణికులకు ఘన స్వాగతం పలికారు. భోగాపురం ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలు మొదలు కావడంతో.. విశాఖపట్నం నుంచి భోగాపురానికి ఆర్టీసీ ఏరో ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి 30 నిమిషాలకు ఒక ఆర్టీసీ ఏరో ఎక్స్ప్రెస్ ఏసీ బస్సు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. పాతగాజువాక నుంచి మద్దిలపాలెం మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్కు ఉదయం 4.55 గంటలకు తొలి సర్వీసు ఉంటుంది.. ఇదే రూట్లో రాత్రి7.45 గంటలకు చివరి బస్సు బయల్దేరుతుంది.
ఆర్టీసీ ఈ ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల్ని ఏఎస్సార్-1, ఏఎస్సార్ -2 పేర్లతో రెండు మార్గాల్లో అందుబాటులో ఉంటాయి. ఏఎస్సార్-1 రూట్లో.. ‘గాజువాక, ఎనఏడీ, గురుద్వార్, జూ పార్క్, మారికవలస, ఆనందపురం, తగరపువలస, ఎయిర్పోర్టు జంక్షన్ మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్కు ఈ సర్వీసు చేరుకుంటుంది’ అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సు ఛార్జీల విషయానికి వస్తే ‘పాత గాజువాక నుంచి భోగాపురం విమానాశ్రయానికి రూ.400, ఎనఏడీ జంక్షన్ నుంచి రూ.350, గురుద్వార్ నుంచి రూ.300, జూ పార్క్ నుంచి రూ.250, మారికవలస నుంచి రూ.200, ఆనందపురం నుంచి రూ.150, తగరపువలస నుంచి రూ.100, ఎయిర్పోర్టు జంక్షన్ నుంచి రూ.50’గా నిర్ణయించారు.
ఏఎస్సార్-2 రూట్లో ‘గాజువాక, సింధియా, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, సిరిపురం, ఇస్కాన్ టెంపుల్, ఐటీ హిల్స్, మారికవలస, ఆనందపురం, తగరపువలస, ఎయిర్పోర్టు జంక్షన’ మీదుగా విమానాశ్రయానికి బస్సులు చేరుకుంటాయి. ఈ రూట్లో బస్సు ఛార్జీలు.. ‘పాత గాజువాక నుంచి ఎయిర్పోర్ట్కు రూ.400, సింధియా నుంచి రూ.400, కంచరపాలెం నుంచి రూ.400, సిరిపురం నుంచి రూ.350, ఇస్కాన్ టెంపుల్ నుంచి రూ.300, ఐటీ హిల్స్ నుంచి రూ.250, మారికవలస నుంచి రూ.200, ఆనందపురం నుంచి రూ.150, తగరపువలస నుంచి రూ.100, ఎయిర్పోర్టు జంక్షన్ నుంచి రూ.50’గా నిర్ణయించారు. ఉదయం 4:30 నుంచి రాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయంటున్నారు. విమాన ప్రయాణికులు బస్సు రూట్లు, ఛార్జీల వివరాలను గమనించాలని సూచించారు.