జలహారతితో వెలిగొండ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం
Åకృష్ణమ్మకు జలహారతితో సీఎం చంద్రబాబు సాష్టాంగం
అక్షర కిరణం, (ఒంగోలు/మార్కాపురం): వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభత్సవ వేళ కష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాష్టాంగ నమస్కారం చేశారు. ముప్పై ఏళ్ల కిందట 1996లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. మళ్లీ 2026లో ఆయనే సీఎంగా ప్రారం భోత్సవం చేస్తుండటంతో ఎమోష నల్ అయ్యారు. గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తే సమయంలోనూ స్థానిక రైతులతోనే బటన్ నొక్కించి నీటిని కిందికి విడుదల చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. 30 సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసి.. ప్రారంభం కూడా ఆయన చేతుల మీదుగానే జరగడంతో సీఎం ఎమోషనల్ అయ్యారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, పైలాన్ ప్రారంభించి జాతికి అంకితం చేసిన అనంతరం కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. అంతేకాకుండా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తే వద్ద కూడా స్థానిక రైతులతోనే బటన్ నొక్కించారు. ఈ దృశ్యాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా వాసుల మనస్సులు గెలుచుకున్నారు.
మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు. అనంతరం తన చేతుల మీదుగా నాలుగు జిల్లాల ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చానన్న భావోద్వేగంలో ఆ కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. ముఖ్యమంత్రి సాష్టాంగ నమస్కారం చేయడంతో అక్కడ ఉన్నవారంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరించిన అనంతరం ఫీడర్ కెనాల్ వద్ద గేట్లు ఎత్తి నీటిని నల్లమల సాగర్ రిజర్వా యర్కు విడుదల చేస్తున్న సందర్భంలోనూ.. స్థానిక రైతుల తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కించి, గేట్లు ఎత్తించారు. రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూసి సీఎం కూడా మురిసిపోవడం విశేషం. ఫీడర్ కెనాల్ వద్ద గేట్లు ఎత్తడంతో శ్రీశైలం జలాలు ముంపు గ్రామాల మీదుగా నల్లమల సాగర్ రిజర్వాయర్లోకి చేరుకున్నాయి.
వెలిగొండ తొలిదశ ప్రాజెక్టుతో 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. 30 ఏళ్ల కల నెరవేరడంతో మార్కాపురం జిల్లా రైతులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడుతో పాటు కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలు అందరూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.