ఏపీ ప్రజలకు రూ.225కే సరుకులు, ధరణి బియ్యం 26 కేజీలు రూ.1300కే
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై బియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువుల ధరల భారం పడకూడదని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెండు, మూడు నెలలుగా బియ్యాన్ని రాయితీ ధరలపై అందిస్తోంది. డిసెంబర్ నెల నుంచి కందిపప్పు, పామాయిల్ కూడా సబ్సిడీపై అందించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరణి బియ్యం విక్రయ కేంద్రాలను 500కు పెంచాలని సూచించారు. వచ్చే నెల నుంచి నిత్యావసరాలను సబ్సిడీపై అందించాలన్నారు.
రూ.225కే సబ్సిడీపై కందిపప్పు, పామాయిల్
డిసెంబర్ నెలలో రేషన్ షాపులతో కందిపప్పు, పామాయిల్ సబ్సిడీపై అందించాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశిం చారు. ప్రజలకు కందిపప్పు కేజీ రూ.100కు, పామాయిల్ లీటర్ రూ.125కి అందించాలన్నారు. ప్రస్తుతం ధరణి బియ్యం విక్రయాల కోసం ఏర్పాటు చేసిన 286 కేంద్రాలు ఉన్నాయని.. వాటిని 500కు విస్తరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఊరట కల్పించేందుకు మార్కెట్లో కందిపప్పు ధరలు తగ్గేలా చూడాలన్నారు. రైతులు కందిని సాగు చేసేలా ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ మార్కెట్ ధరలతో పాటుగా ద్రవ్యోల్బణాన్ని బేరీజు వేసుకోవాలన్నారు. బియ్యం, నిత్యావసరాలు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు టోల్గేట్లు, సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర అవసరమైన నిఘా పెంచాలని అధికారులకు సూచించారు.
మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు
అగ్రివాచ్ రిపోర్టుల ప్రకారం రాబోయే రోజుల్లో ఉల్లి, టమాటా ధరలు తగ్గుతాయని తెలుస్తోందన్నారు చంద్ర బాబు. ఇటు ప్రజలపై కూరగాయల భారం పడకుండా.. వాటి ధరలు పెరగకుండా చూడాలన్నారు. ఎల్‌నినో ప్రభావం పంటలపై ఉందని.. ముందుగానే ఓ అంచనాకు రావాలన్నారు. ఉదాహరణకు కృష్ణా డెల్టా వంటి ప్రాంతంలో తక్కువ నీళ్లతో పండించే సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగును నీళ్లు ఎక్కువగా ఉన్నచోటే ప్రోత్సహించాలన్నారు. కేంద్రంతో మాట్లాడి సన్న రకాలకు అదనపు మద్దతు ధర దక్కేలా చూడాలని మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్‌కు చంద్రబాబు సూచించారు.
బియ్యం ధరలు తగ్గాయన్న అధికారులు
రాష్ట్రంలో బియ్యం ధరలు అక్టోబర్‌తో పోలిస్తే తగ్గాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. బియ్యం ధరలు 18శాతం వరకు తగ్గాయని.. బయట మార్కెట్లో బియ్యం ధరల్ని ముఖ్యమంత్రికి వివరించారు. ఏ రకం బియ్యం ఎంత ధర ఉందో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ధరల పట్టికను ప్రకటించడంతో పాటుగా బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నిల్వలపై నిఘా పెట్టామని తెలిపారు. ఉల్లిపాయల ధరలు 28శాతం వరకు.. పామాయిల్ ధర 5శాతం వరకు తగ్గినట్లు చంద్రబాబుకు వివరించారు.
ధరణి బియ్యానికి డిమాండ్..
26 కేజీల బస్తా రూ.1300కే
రాష్ట్రవ్యాప్తంగా ధరణి బ్రాండ్ బియ్యానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. 26 కేజీల బస్తా రూ.1300కే ఇవ్వడంతో కొనుగోళ్లు పెరిగాయన్నారు. బియ్యాన్ని కేజీ రూ.50 వరకు అందిస్తున్నామని.. ఇప్పటివరకు చూస్తే దాదాపు 2.25 లక్షల మందికి పైగా వినియోగదారులు ఏకంగా 59,662 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసి నట్లు అధికారులు వివరించారు. విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ టీమ్‌లు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన చోట కేసులు నమోదు చేసినట్లు తెలి పారు.. జరిమానాల రూపంలో రూ.84.59 లక్షలు వసూలు చేశామని వివ రించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం పడకుండా చర్యలు తీసుకుంటోంది.. బియ్యం, సరుకుల్ని రాయితీపై అందిస్తోంది.