ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు
ఉద్రిక్తతలకు దారి తీసిన సనాతన్ రక్షక్ దళ్ చర్యలు
సాయిబాబా భక్తుల ఆగ్రహం
అక్షర కిరణం, (ఉత్తర్‌ప్రదేశ్/జాతీయం): ఉత్తర్ ప్రదేశ్‌లో కొన్ని చోట్ల ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. వారణాసిలో బడా గణేశ్, పురుషోత్తమ తదితర పది ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించారు. ‘సనాతన్ రక్షక్ దళ్’ చేపట్టిన ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి నుంచి ఈ చర్యకు దిగారు. బడా గణేశ్ ఆలయ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం సనాతన్ రక్షక్ దళ్ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం అక్కడ సాయిబాబా విగ్రహాన్ని ఆలయం నుంచి బయటకు తీసి ప్రాంగణం వెలుపల పెట్టారు. సరైన అవగాహన లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని.. వాస్తవానికి శాస్త్రాల్లో బాబా ఆరాధన గురించి ఎక్కడా చెప్పలేదని బడా గణేశ్ ఆలయ ప్రధాన పూజారి, సనాతన్ రక్షక్ దళ్ సభ్యుడు రాము గురు అన్నారు.
అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయ మహంతు రాజు దాస్ సైతం ఈ చర్యను సమర్థించడం గమనార్హం. సాయి బాబా ధర్మ గురువే కావచ్చు, కానీ దైవం కాదని ఆయన అన్నారు. ‘సాయిబాబా ధర్మగురువు.. మహాపురుషుడు.. పండితుడు కావచ్చు కానీ భగవంతుడు కాదు.. సాయి బాబా విగ్రహాన్ని ఆలయం నుంచి తీసేసి వారణాసి వ్యక్తికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను.. దేశంలోని సనాతను లంతా సాయిబాబా విగ్రహాలను ఆలయాల నుంచి తొలగిం చాలి’ అని పిలుపునిచ్చారు. కాగా, వారణాసి అన్నపూర్ణ ఆలయం ప్రధాన పూజారి శంకర్ పూరి సైతం.. శాస్త్రాల్లో సాయిబాబా ఆరాధన గురించి ప్రస్తావన లేదని వ్యాఖ్యానిం చారు. వారణాసిలో ఆది దేవుడైన పరమేశ్వరుడి ఆరాధన మాత్రమే జరగాలని దళ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌శర్మ పేర్కొ న్నారు. భక్తుల మనోభావాలను గౌరవించి పది ఆలయా ల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించామని, రాబోయే రోజుల్లో అగస్త్యకుండ, భుటేశ్వర్ ఆలయంలో విగ్రహాలను తొలగిస్తామని చెప్పారు. అయితే, వారణాసిలోని సంత్ రఘువర్ దాస్ నగర్‌లోని సాయిబాబా ఆలయ పూజారి సమర్ఘోష్ దీనిపై స్పందించారు. ‘ఈరోజు సనాతనుల మని చెప్పుకుంటున్నవారే గతంలో ఈ ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను ప్రతిష్ఠించారు.. ఇది సరైన చర్య కాదు’ పేర్కొన్నారు. తమ ఆలయానికి భక్తులు రోజు వస్తారని, గురువారాల్లో 4 నుంచి 5 వేల మంది దర్శించుకుంటారని ఆయన తెలిపారు.