గుర్లలో డయేరియాతో ఎనిమిది మంది మృతి
మూడు రోజుల్లో వ్యాధి లక్షణాలతో ఎనిమిది మంది మృతి మరికొందరికి ఆస్పత్రుల్లో చికిత్స పరామర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే, వైద్య శిబిరం ఏర్పాటు
అక్షర కిరణం, (గుర్ల/విజయనగరం): విజయ నగరం జిల్లా గుర్లలో డయేరియా లక్షణాలతో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా ఈగ్రామంలో డయేరియాతో పలువురు అస్వస్థులయ్యారు. కాగా ఆదివారం డయేరియా లక్షణాలతో చింతపల్లి అప్పారావు మృతి చెందగా మంగళవారం ఒక్కరోజే ఈ లక్షణాలతో నలుగురు మరణించారు. బుధవారం ఉదయం ఇద్దరు మృతి చెందారు. వరుస మరణాలతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత నాలుగు రోజులుగా పెరుగుతున్న రోగులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు చికిత్స అందిస్తున్నారు. డీఎంహెచ్‌వో భాస్కర్‌రావు పరివేక్షణలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. దీనిపై డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కరరావు ను వివరణ కోరగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి డయేరియా రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ లక్షణాలతో ఉన్న చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే పరిస్థితి విషమంగా ఉన్న రోగులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి, విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నామని తెలిపారు. డయేరియాను కట్టడి చేసేందుకు నిరంతరం వైద్య బృందం పనిచేస్తోందని దీనిపై ప్రజలు ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రోగులను పరామర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే
వైద్య శిబిరాల్లో ఉన్న రోగులను జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎమ్మెల్యే కళా వెంకట్రావు, చీపురుపల్లి ఆర్డీవో పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు
ఈసందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మీడియాతో మాట్లాడుతూ గుర్లలో డయేరియా అదుపులో ఉందని తెలిపారు. వదంతులను నమ్మవద్దని కోరారు. ఆందోళన అవసరం లేదని, ఇంటింటికి క్లోరినేటెడ్ నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు. వాటర్ శాంపిల్స్ తీసి పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. నీటి కాలుష్యం జరిగిన బోరు బావులను సీజ్ చశామని తెలిపారు. అతిసారానికి గురైన వారిని పూర్తిగా తగ్గేదాక ఇంటికి పంపకుండా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. మరణించిన నలుగురు వేర్వేరు కారణాలతో మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.