శాసనమండలి డిప్యూటీ చైౖర్మన్‌గా తూమాటి మాధవరావు
అక్షర కిరణం (అమరావతి): ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్ పదవి కోసం మరో అభ్యర్థి ఎవరూ పోటీ పడక పోవటంతో మండలి డిప్యూటీ ఛైర్మన్ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అధికారికంగా ప్రకటించారు. డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావు బాధ్యతలు స్వీకరించారు. తూమాటి మాధవరావును ఛైర్మన్ మోషేన్ రాజు.. సీటులో కూర్చోబెట్టారు. అనంతరం శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్సీలు ఆయనను అభినందించారు. మరోవైపు మాధవ రావును ఛైర్లో కూర్చోబెట్టే సమయంలో అన్ని పార్టీల సభ్యులు రావాలని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కోరారు. అయితే ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్సీలు ముందుకు రానట్లు తెలిసింది. దీంతో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, వైసీపీ నేతలు బొత్స సత్య నారాయణ, తోట త్రిమూర్తులు మిగతా ఎమ్మెల్యేలు మాధవ రావును ఛైర్మన్ సీటులో కూర్చోబెట్టి అభినందించారు.
మాధవరావును మండలి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేం దుకు కూటమి పార్టీల ఎమ్మెల్సీలు ముందుకు రాకపోవటంపై బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ ఛైర్మన్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టే సందర్భంలో అధికార పార్టీ రాకపోవటం దురదృష్టకరమని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రూల్స్ గురించి మాట్లాడే మంత్రులు.. డిప్యూటీ ఛైర్మన్ పదవికి గౌరవం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి.. ఇప్పటి వరకూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదన్న బొత్స సత్యనారాయణ.. సభాధ్యక్ష స్థానం పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. మంత్రులు నీతులు చెప్పడం కాదని.. సభా విలువలు, సంప్రదాయాలు పాటించాలని విమర్శించారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన డిప్యూటీ ఛైర్మన్‌ను అన్ని పార్టీల సభ్యులు కలిసి.. అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం సభా సంప్రదాయమని ఛైర్మన్ మోషేన్ రాజు అభిప్రాయపడ్డారు.
మరోవైపు డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న జకియా బేగం గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. జకియా బేగం పదవీకాలం పూర్తి కావటంతో మరొకరిని డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. మండలిలో వైసీపీకి పూర్తిస్థాయిలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.