ఇకపై 9 కోచ్‌లతో తిరుపతి టు విశాఖపట్నం డబుల్ డెక్కర్ రైలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22708/22707) కోచ్‌లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.. గతంలో 11 కోచ్‌లతో ఈ రైలు నడవగా..ఇకపై 9 కోచ్‌లతో నడుస్తుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లేవారికి ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22708/22707)కు సంబంధించి రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలు కోచ్‌లలో మార్పులు చేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. తిరుపతి-విశాఖపట్నం (22708) ఎక్స్‌ప్రెస్ రైలు 30-09-2026 నుంచి 9 బోగీలతో నడవనుంది.. అలాగే విశాఖపట్నం-తిరుపతి (22707) ఎక్స్‌ప్రెస్ రైలు 01-10-2026 నుంచి 9 కోచ్‌లతో నడుస్తుందని తెలిపారు.
రైల్వేశాఖ తాజాగా చేసిన మార్పుల ప్రకారం.. విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22708/22707)లో మొత్తం 9 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 3 ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయి, 4 ఏసీ ఎకానమీ కోచ్‌లు ఉంటాయి, 2 లగేజీ/ జనరేటర్/ బ్రేక్ వ్యాన్/ కోచ్‌లు ఉంటాయి. గతంలో విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22708/22707)లో 11 కోచ్‌లు ఉండేవి.. వీటిలో 9 ఏసీ ఛైర్ కార్లు ఉండేవి.. రెండు లగేజీ/ జనరేటర్/ బ్రేక్ వ్యాన్/ కోచ్‌లు ఉండేవి. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ రైలులో 11 కోచ్‌లను 9కి తగ్గించారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
తిరుపతి-విశాఖపట్నం (22708) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉంటుంది. తిరుపతిలో రాత్రి 9.50కు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.40 గంటలకు విశాఖపట్నం చేరుకుం టుంది. విశాఖపట్నం-తిరుపతి (22707) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి సోమవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నంలో రాత్రి 11 గంటలకు బయల్దేరి.. తిరుపతికి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు తిరుపతి, రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, గూడూరు జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం విశాఖపట్నంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్లే వారికి ఈ రైలు సౌకర్యంగా ఉంటుంది.