జిల్లాలో ఎరువుల కొరత లేదు
Åఅధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు Å16 మంది డీలర్ల లైసెన్సులు రద్దు Å62 మందికి షోకాజ్ నోటీసులు
Åరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
అక్షర కిరణం, (శ్రీకాకుళం /కోటబొమ్మాళి): జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల లభ్యతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,65,583 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి ఇప్పటివరకు 1,51,857 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయని మంత్రి తెలిపారు. ఖరీఫ్ పంటలకు జిల్లాకు మొత్తం 37,707 టన్నుల యూరియా, 22,322 టన్నుల డీఏపీ అవసరమని, ఇప్పటివరకు 27,147 టన్నుల యూరియా, 10,815 టన్నుల డీఏపీ జిల్లాకు చేరిందని వివరించారు. ఇందులో 12,158 టన్నుల యూరియా, 5,277 టన్నుల డీఏపీని రైతు సేవా కేంద్రాలు, సొసైటీలతో ఏపీ ఏఐఎంఎస్ యాప్‌లో నమోదు చేసుకుని పారదర్శకంగా రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 11,132 టన్నుల యూరియా, 3,766 టన్నుల డీఏపీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
రైతులకు ఎరువుల లభ్యతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువులను నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయించే ప్రైవేట్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల నుంచి అందిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిం చామని, నిబంధనలు ఉల్లంఘించి ఎరువులను అధిక ధరలకు విక్రయించిన 16 మంది ప్రైవేట్ డీలర్ల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మరో 62 మంది డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరైనా ఎరువుల విషయంలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలం లో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.