ఆయోధ్య రామాలయంలో మరోసారి ప్రాణప్రతిష్ఠ
రామ దర్బార్ ప్రతిష్ఠాపన వేడుకలు
అక్షర కిరణం, (అయోధ్య/జాతీయం): అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మరోసారి ఆధ్యాత్మిక శోభతోవెలిగిపోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గతేడాది విజయవంతంగా పూర్తి కాగా.. ఇప్పుడు అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆలయం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ, ఇతర దేవాలయాల ప్రతిష్ఠాపన వేడుకలు సాగుతున్నాయి. ఈ పవిత్ర క్రతువు మంగళవారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కాగా.. ఈనెల 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ వేడుకల్లో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు.
రామ దర్బార్ వేడుకలతో పాటు.. జూన్ 5వ తేదీన అయోధ్యలో సరియు జయంతి జన్మోత్సవ్ వేడుకలను నిర్వహించనున్నారు.ఈ సరియు జయంతి జన్మోత్సవాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ జ్యోతిని వెలిగించి ప్రారంభిస్తారని శ్రీరామ్ వల్లభ్కుంజ్ అధిపతి మహంత్ రాజ్‌కుమార్ దాస్ మహారాజ్ వెల్లడిరచారు. అదే రోజు జరిగే రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా యోగి ఆదిత్యనాథ్ హాజరు కానున్నట్లు తెలిపారు.
ఇక అయోధ్య రామాలయంలో జూన్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వారం రోజుల పాటు సరియు జయంతి జన్మోత్సవ్ వేడుకలుజరుగుతాయి. ఆంజనేయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భక్తి కార్యక్రమాలు, వివిధ పూజలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు భక్తులను కనువిందు చేయనున్నాయి. జూన్ 11వ తేదీన పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించబడుతుందని మహంత్ రాజ్‌కుమార్ దాస్ మహారాజ్ తెలిపారు.
ఇక ఆంజనేయ సేవా సమితి అధ్యక్షుడు మహంత్ శశికాంత్ దాస్ మాట్లాడుతూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకకు హాజరు కావడం తమకు చాలా ప్రత్యేకమని తెలిపారు. ఈ సందర్భంగా రామ భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో అయోధ్య అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే ఆయన ఏవైనా కీలక ప్రకటనలు చేయవచ్చని మహంత్ శశికాంత్ దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా అయోధ్య అధికారులు ఇప్పటికే రామ్‌పథ్, ధర్మ 14 కోసి మార్గ్ వంటి కీలక మతపరమైన మార్గాల్లో మాంసం విక్రయాలపై నిషేధం విధించే చర్యలు ప్రారంభించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతా దర్బార్‌లో ఫిర్యాదులు వచ్చిన తర్వాత దుకాణదారులకు ఈ నోటీసులు జారీ చేశారు. అయోధ్య మేయర్ గిరీష్ పతి త్రిపాఠి శనివారం మాట్లాడుతూ.. మద్యం నిషేధం కూడా ప్రణాళికలో ఉందని.. ఈ విషయంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయోధ్యను పవిత్ర నగరంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.