పెళ్లి పేరుతో 50 మంది యువతులకు మోసం
కభారీగా డబ్బు, బంగారు నగలు దోచుకుంటున్న నిందితుడి అరెస్టు
అక్షర కిరణం, (తిరునెల్వేలి/జాతీయం): పెళ్లి పేరుతో ఓ యువకుడు.. ఏకంగా 50 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు. లగ్జరీ కార్లు, బంగ్లాను అద్దెకు తీసుకుని, అవి తనవేనని నమ్మించి, యువతుల నుంచి డబ్బు, బంగారం కాజేశాడు. మ్యాట్రిమోనిలో తన ఫ్రొఫైల్లో బిజినెస్‌మెన్‌గా పేర్కొన్న అతడు.. తనను కాంటాక్ట్ అయ్యే యువతులను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారి వద్ద నుంచి నగదు, నగలతో ఉడాయించేవాడు. విస్తుగొలిపే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరునెల్వేలికి చెందిన 28 ఏళ్ల సూర్య అనే యువకుడు పెళ్లి పేరుతో పదుల సంఖ్యలో యువతుల్ని మోసగించిన విషయం వెలుగులోకి వచ్చింది.
వధువు కావాలని మ్యాట్రిమోని సైట్లో ఫ్రొఫైల్ పెట్టిన సూర్య.. ఓ పారిశ్రామికవేత్తగా పేర్కొన్నాడు. ఈ ప్రొఫైల్ నచ్చి తను సంప్రదించే యువతులను పెళ్లి చేసుకుంటాడని చెప్పి సన్నిహితంగా మెలిగేవాడు. వాళ్లను నమ్మించి నగదు, నగలు కాజేసేవాడు. ఈ క్రమంలో అతడి చేతిలో మోసపోయిన చెన్నైకి చెందిన ఓ నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద రూ.8.7 లక్షల నగదు, రూ.7.5 లక్షల విలువైన నగలు దోచుకున్నాడని ఆరోపించింది. దీంతో అన్నానగర్ మహిళా పోలీసు స్టేషన్ అధికారులు కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సెప్టెంబరులో నిందితుడు సూర్య పోలీసులకు చిక్కాడు.
విచారణలో అతడు చాలా మందిని మోసం చేసినట్టు వెల్లడయ్యింది. బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చిన ఫిర్యాదు చేయడంతో కస్టడీకి తీసుకున్నారు. మ్యాట్రిమోని ద్వారా దాదాపు 50 మంది యువతులు అతడి చేతిలో మోసపోయినట్టు దర్యాప్తులో తేలింది. లగ్జరీ కార్లు, బంగ్లాను అద్దెకు తీసుకున్న సూర్య.. తనవే అన్నట్లు నటించాడని గుర్తించారు. అతడు ఓ మోసగాడని, ఆంధ్రప్రదేశ్‌లో భార్య, ఓ బిడ్డ కూడా ఉందని విచారణలో బయటపడిరది. అతడి దగ్గర ఓ ఎస్యూవీ, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇతర పత్రాలను అరెస్ట్ సమయంలో స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతేడాది యూపీకి చెందిన ఓ వ్యక్తి కూడా పెళ్లి పేరుతో ఇలాగే ఓ జడ్జి సహా 50 మందిని మోసం చేసిన కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.