ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ
ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి
ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఆప్టా నాయకుల వినతి
అక్షర కిరణం, (అమరావతి): సుప్రీం కోర్టు గత నెల సెప్టెంబర్ 1న వెలువరించిన తీర్పులో భారత దేశంలోని అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయులు (ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నవారు) రిటైర్మెంట్కి 5 లోపు ఉన్నవారు మినహా అందరూ తీర్పు వెలువరించిన రెండు సంవత్సరాల లో తప్పనిసరిగా టీచర్స్ ఎలిజిబులిటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే సర్వీస్‌లో కొనసాగడం లేదా పదోన్నతి పొందగలరని తీర్పు ఇచ్చిందని, అయితే ఇన్ సర్వీస్ ఉపాద్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఆప్టా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈమేరకు ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను కలిసి విన్నవించారు. ఇప్పటి వరకూ ఈ విషయంలో సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు నివ్వాలని కోరుతూ చాలా రాష్ట్రాలు, తమ సంఘంతోపాటు ఇతర సంఘాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు వేశాయని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏజీఎస్ గణపతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాశ్‌రావు మంత్రి లోకేష్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయలేదని, సరికదా టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారని, దీనిపై ఉపాధ్యాయులు చాలా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రిగా మీ దృష్టికి తీసుకువస్తున్నామని వారు నారా లోకేష్‌కు తెలియజేశారు. దీనిపై ఆయన స్పందించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తరపున టెట్ విషయంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈమేరకు అధికారులకు తగిన చర్యలు నిమిత్తము ఆదేశాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులకు మనోధైర్యం కల్పిస్తారని, వారి మానసిక ఆందోళనను తొలగిస్తారని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) నాయకులు ఆకాంక్షించారు.