కేజీబీవీ హాస్టల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
ఐదుగురు విద్యార్థినులకు అస్వస్థత
అక్షర కిరణం, (విజయనగరం): గుర్లలోని కేజీవీబీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యార్థుల డార్మెటరీ గదిలో పరుపులు ఇతర సామగ్రి కాలి బూడిద అయ్యాయి. దీంతోపాటు ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తొమ్మిదో తరగతి విద్యార్థినులు వెంకటలక్ష్మి, సంజన, సెకండ్ ఇంటర్ విద్యార్థినులు శ్రావణి, సుజాత, ఎనిమిదో తరగతి విద్యార్థిని దీక్ష్షిత అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదంపై సకాలంలో స్పందించిన పోలీసులు, విద్యుత్ అధికారులు అస్వస్థతకు గురైన విద్యార్థులను నెల్లిమర్ల పీఎస్సీకి తరలించారు. ప్రమాద స్థలాన్ని చీపురుపల్లి సీఐ శంకర్రావు, ఎస్ఐ నారాయణరావు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేసి తెలుసుకుంటామని తెలిపారు. జిల్లా వైద్య అధికారి జీవన్ రాణి నెల్లిమర్ల పీహెచ్సీని సందర్శించి పిల్లల ఆరోగ్యంపై వైద్య అధికారులతో మాట్లాడి తెలుసుకు న్నారు. పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. ఈ ప్రమాదంపై వైద్య అధికారులతో మాట్లాడిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ప్రమాదానికి గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అస్వస్థత గురైన విద్యార్థులను తెలుగుదేశం కూటమి నాయకులు పరామర్శించారు.