అరెస్ట్ చేసిన సీజేపీ కార్యకర్తలను విడుదల చేయండి
Åరాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశం
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): నీట్-యూజీ 2026 పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసన ల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్రాలను ఆదేశించింది. పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయవచ్చని, కానీ ప్రస్తుతానికి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని వారిని విడుదల చేయా లని కూడా ఆదేశించింది. అయితే, నేర చరిత్ర ఉన్న వ్యక్తుల ను కోర్టు మినహాయించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనేది మాత్రం స్పష్టం చేయలేదు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమై ఆ తర్వాత మహారాష్ట్ర, బిహార్, గుజరాత్, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళలకు వ్యాపించిన నిరసనల సందర్భంగా పోలీసులు మితిమీరిన బలప్రయోగం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్చి, జస్టిస్ వి మోహన లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై నిరసన చేస్తున్న విద్యార్థులపై రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 20, 21లను ఉల్లంఘి స్తూ పోలీసులు లాఠీచార్జి, పెల్లెట్గన్లు, టియర్ గ్యాస్, విద్యు త్ ఆయుధాలను ప్రయోగించారని పిటిషన్లలో ఆరోపించా రు. ప్రాథమికంగా తమ ముందు ఉంచిన ఆరోపణలపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించిన అన్ని సీసీటీవీ, డ్రోన్, బాడీ-కెమెరా, వైర్లెస్ కమ్యూనికేషన్, పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్) రికార్డులను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసనకారుల డిజిటల్ డేటాను భద్రపరచాలని, దానిని బహిరంగంగా విడుదల చేయకూడదని పోలీసులను కోరింది. వారి వ్యక్తిగత డేటా లేదా వివరాలు ఏవీ ప్రచురించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 3న జరగనున్న తదుపరి విచారణకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హాజరు కావాలని కూడా కోర్టు కోరింది.