చమోలీలో వీధికుక్కల విజృంభణ: ఆగస్టు 23 వరకు 10 స్కూళ్లు బంద్
అక్షర కిరణం, (ఉత్తరాఖండ్/జాతీయం): ఉత్తరా ఖండ్‌లోని కొండ ప్రాంతమైన చమోలీ జిల్లాలో వీధికుక్కల విజృంభణ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా నారాయణ్‌బగడ్, నల్గావ్ ప్రాంతాల పరిధిలో కుక్కల దాడులు ఎక్కువ కావడంతో.. స్థానిక ప్రజలు తీవ్రంగా వణికిపోతున్నారు. విద్యార్థులు, పిల్లలు, వృద్ధులు కుక్కల దాడికి బలి కాకుండా ఉండేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లనీయడం లేదు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, జిల్లా అధికా రులు సైతం వారికి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల ప్రాణ రక్షణే ధ్యేయంగా ఈ నెల 23వ తేదీ నుంచి మొత్తం 10 పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
వీధికుక్కల దాడులతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
స్థానికంగా వీధికుక్కల బెడద తీవ్రస్థాయికి చేరిందని, చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర భయభ్రాంతు లకు గురవుతున్నారని స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షించి మరీ పై జిల్లా అధికారులకు నివేదిక అందిం చారు. నారాయణ్‌బగడ్, నల్గావ్ శ్రేణుల పరిధిలో పరిస్థితి విషమంగా మారడంతో.. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల నిర్వహణ ప్రమాదకరంగా మారిందని ఆ నివేదికలో స్పష్టం చేశారు. అయితే స్థానిక అధికారుల నుంచి వచ్చిన క్షేత్రస్థాయి నివేదికను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే.. ఈ తాత్కాలిక మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నట్లు చమోలీ జిల్లా ప్రధాన విద్యాధికారి ఆకాశ్ సారస్వత్ వెల్లడించారు.
అయితే ఈ ఉత్తర్వులు కేవలం ప్రభుత్వ బడులకే పరిమితం కాకుండా సదరు ప్రాంతాల పరిధిలోని ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన ముందస్తు చర్యగా 10 విద్యాసంస్థలను ఈ నెల 23 వరకు మూసి ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ రెండు ప్రాంతాల్లో వీధికుక్కల గుంపులు వీధులు, పాఠశాలల పరిసరాల్లో గుమిగూడుతుండటంతో చిన్నపిల్లలను బయటకు పంపొద్దని కూడా సూచించారు. ఇప్పటికే తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు పంపడం లేదు.. కానీ తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ నిర్ణయం వల్ల పిల్లల చదువుకు విరామం వచ్చినప్పటికీ.. వారి ఆరోగ్యమే తమ మొదటి ప్రాధాన్యమని విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు వీధికుక్కల సమస్యను అదుపులోకి తెచ్చేందుకు స్థానిక యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈనెల 23వ తేదీ వరకే బడులు బంద్ చేసినప్పటికీ.. పరిస్థితి పూర్తిగా సర్దుమనిగి, విద్యార్థులకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.