రద్దయిన డిగ్రీ కళాశాల పునః ప్రారంభం
అక్షర కిరణం, (శ్రీకాకుళం /కోటబొమ్మాళి): కోట బొమ్మాళిలో గతంలో రద్దయిన డిగ్రీ కళాశాల మళ్లీ మంజూరైంది. గత 2014-19 టీడీపీ హయాంలో మంత్రి అచ్చెన్నాయుడు కృషి ఫలితంగా డిగ్రీ కళాశాల మంజూరైంది.
అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల అవసరం లేదంటూ దాన్ని రద్దు చేసింది. దీంతో కోటబొమ్మాళి పరిసర ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బాలికలు డిగ్రీ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణం, వసతి ఖర్చులు పేద కుటుంబాలకు అదనపు భారంగా మారాయి.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో
మళ్లీ డిగ్రీ కళాశాల
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏళ్లుగా మూలనపడిన డిగ్రీ కళాశాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కళాశాలను పునరుద్ధ రించేందుకు కృషి చేశారు. ఇందులో భాగంగా కోట బొమ్మాళి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ తరగతులు నిర్వహించేందుకు అదనపు గదులను ఏర్పాటు చేశారు. ఈ అదనపు గదులను శుక్రవారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. అదేగదుల్లో డిగ్రీ తరగతులను కూడా మంత్రి ప్రారంభించనున్నారు. దీంతో కోటబొమ్మాళి ప్రాంత విద్యార్థులకు తమ సొంత ప్రాంతం లోనే డిగ్రీ విద్యను అభ్యసించే అవకాశం కలగనున్నదని ఈప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు