పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు
అక్షర కిరణం (కోటబొమ్మాళి/శ్రీకాకుళం): వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం రెండు రోజులు ముందుగా సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలంకన్నెవలస గ్రామంలో గురువారం ఎన్డీఆర్ భరోసా పింఛన్లను మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి జాతీయ రహదారి నుంచి కన్నెవలస వరకు, గ్రామంలో అంతర్గత రహదారులను రూ.88 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులను మంత్రి ప్రారంభించారు. పించన్దారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నేరడీ బ్యారేజ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయని, బ్యారేజి నిర్మాణానికి సుమారు రూ.641 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈబ్యారేజ్ నిర్మాణం పూర్తయితే రైతాంగానికి నిరంతరాయంగా సాగునీరు అందించి జిల్లా సస్యశ్యామలం కావడంతోపాటు జిల్లా ముఖ చిత్రం మారనుందని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి ప్రసాద్, ఆర్డీఓ ఎం.కృష్ణ మూర్తి, ఇంజినీరింగ్ అధికారి ఎం.సుధాకర్‌రావు తదితరులు, పాల్గొన్నారు.