అర్నబ్ తుపాన్ విధ్వంసంతో ఏడుగురు మృతి..
Åకోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం
అక్షర కిరణం, (విశాఖపట్నం/అమరావతి): అర్నబ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలోని పాత గోశాల సమీపంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. సింహాచలం బాలాజీనగర్ ప్రాంతంలోనూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రెండు ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. చర్చి సమీపంలో చెట్టు విరిగిపడటంతో చొక్కా కిశోర్ (45) మరణించగా.. బొండాడవారి వీధిలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో రాంబాబు (34) మృతి చెందారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం ప్రకాశ్పురం లో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. అదే జిల్లాలో బలమైన గాలులకు గుడిసె కూలిపోవడంతో కొల్లు వెంకాయమ్మ అనే మరో వృద్ధురాలు మృతి చెందింది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో తెగిపడిన విద్యుత్ తీగల కారణంగా విద్యుత్ షాక్కు గురై ఓ మహిళ మరణించింది. తుపాను ధాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. జిల్లావ్యాప్తంగా సుమారు 6 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు సంబంధిత శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. నేలకొరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉండటంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రజలు చీకట్లోనే మగ్గిపోనున్నారు. తెగిపడిన విద్యుత్ తీగలు, కూలిన స్తంభాల వద్దకు వెళ్లవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమలాపురం-రావులపాలెం ప్రధాన రహదారితో పాటు కొత్తపేట నుంచి అమలాపురం వెళ్లే మార్గంలో చెట్లు కూలి పోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రహదారులపై పడిన చెట్లను తొలగించేందుకు సిబ్బంది, యంత్రా లను రంగంలోకి దించారు. తుపాను ప్రభావం దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు అలలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అలల ఉద్ధృతికి ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు పలు చోట్ల కోతకు గురైంది. సుబ్బంపేట సమీపంలో రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఉప్పాడ, సుబ్బంపేట, సూరడపేట, జగ్గరాజుపేట, పల్లిపేట, రంగంపేట, మాయాపట్నం తదితర తీర ప్రాంత గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. అలల ఉద్ధృతికి సుమారు 30 ఇళ్లు నేలమట్ట మైనట్లు సమాచారం. మరికొన్ని ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. సుబ్బం పేట వద్ద తీర రక్షణ కోసం ఏర్పాటు చేసిన గోడ కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాత్రంతా కురిసిన వర్షాలు, బలమైన ఈదురుగాలులతో రహదారులు జల మయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ పాత రెండంతస్తుల భవనం కూలిపోయింది. భోగాపురం మండలంలోని పలు గ్రామాలకు రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వరదనీరు కొన్ని కాలనీల్లోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత బుధవారం పర్యటించారు. గత 24 గంటల్లో కురిసిన వర్షాలతో వరహా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించారు.
చిన్న గుమ్ములూరు, పెద్ద గుమ్ములూరు తదితర ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి హోంమంత్రి వంగలపూడి అనిత వారి సమస్యలను తెలుసుకున్నారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం, అక్కడ అందుతున్న సదుపాయాలపై అధికారులతో చర్చించారు. తుపాను ముప్పు పూర్తిగా తొలగే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. కూలిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.