20 నుంచి 22 వరకు సౌత్ మిడ్ జోనల్ ఫిజీషియన్ల వార్షిక సదస్సు
ఏడు రాష్ట్రాల నుంచి వెయ్యి మందికి పైగా హాజరు: డాక్టర్ కే రాంబాబు
అక్షర కిరణం (విశాఖపట్నం సిటీ): సౌత్ జోనల్, సౌత్ మిడ్ జోనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు ఈనెల 20న విశాఖపట్నంలో ప్రారంభంకానున్నట్లు ఏపీ ఫిజీషియన్ల సంఘం అధ్యక్షులు, కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ కే రాంబాబు తెలిపారు. విమ్స్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈనెల 20 నుంచి 22 వరకు మూడు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరినాలో సదస్సు నిర్వహిస్తున్నామ న్నారు. సౌత్ జోన్ ఫిజిషియన్ సదస్సు విశాఖలో జరగడం ఇదే మొదటిసారన్నారు. సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న 60 మందికి పైగా ప్రముఖ వైద్యులు ప్రసంగించునున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలతో పాటు లక్షదీవులు, పాండిచ్చేరి నుంచి 1,100 నుంచి 1200 మంది వైద్యులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. మూడు రోజులు పాటు నిర్వహించే ఈ సదస్సులో వైద్యులకు.. వైద్య విద్యార్థు లకు వైద్య విధానంలో వచ్చిన మార్పులు, నూతన పద్ధతులు తదితర అంశాలు గురించి వివరిస్తారన్నారు. సదస్సులో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు గోల్డ్ మెడళ్లు, అవార్డులు అందజేయనున్నామన్నారు. సదస్సులో సౌత్ జోన్ నుంచి ఏ ఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు సెంథిల్ రాజప్ప, బెంగుళూర్కి చెందిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సతీష్ చంద్ర తదితరులు పాల్గొంటారని తెలిపారు.