తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైలుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం..
అక్షర కిరణం, (విశాఖపట్నం): తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్ రైలుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్‌పై ప్రయాణికుల నుంచి తరచుగా ఫిర్యాదులు అందడంతో రైల్వే శాఖ యాక్షన్‌లోకి దిగింది. ఈ రైలును 2012లో తిరుపతి -హైదరాబాద్ మధ్య ఏర్పాటు చేశారు. అయితే ఈ రూట్లో పెద్దగా ఆదరణ రాకపోవడంతో తర్వాత ఈ ట్రైన్‌ను వేరే రూటులో వేశారు. తిరుపతి-విజయవాడ, కర్నూల్-హైదారాబాదు మధ్య నడిపారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోవ డంతో ఈ రైలును 2016 డిసెంబర్ 31 నుంచి తిరుపతి-విశాఖపట్టణ మధ్య నడుపుతున్నారు.
ఈ డబుల్ డెక్కర్ రైలు ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 10.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమ, గురు, శనివారాల్లో రాత్రి 11 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. మొత్తం 9 బోగీలతో నడిచే ఈ రైలులో ఒకేసారి 720 మంది ప్రయాణించ వచ్చు.
ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు
అయితే కాలక్రమేణ రైలు పాతబడిపోవడంతో బోగీలు తుప్పు పట్టాయి. దీంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రైల్వే శాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో అధికారులు ఒక్కో డబుల్ డెక్కర్ బోగీని తొలగిస్తూ వచ్చారు. వాటి స్థానంలో రెడ్ కలర్లో ఉండే సాధారణ ఏసీ బోగీలను ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈ రైలులో కేవలం రెండు మాత్రమే డబుల్ డెక్కర్ బోగీలు మిగలగా.. మిగిలిన ఏడు సాధారణ ఏసీ బోగీలతోనే నడుస్తోంది.
ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రైల్వే శాఖ పూర్తిగా కొత్త బోగీలతో సరికొత్త డబుల్ డెక్కర్ రైలును తయారు చేయించింది. ఈ రైలు పంజాబ్‌లోని కపూర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైంది. ప్రస్తుతం అక్కడే ట్రయల్ రన్స్ చేస్తుంది. ట్రయల్స్ అవ్వగానే త్వరలోనే ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.