10 పోలీసు బృందాలు, 3 రాష్ట్రాల్లో సోదాలు.. సత్యనికేతన్ పీజీ యజమాని అరెస్ట్
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): ఢిల్లీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల పీజీ భవనం కూలి ఏడుగురు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పటి నుంచి పీజీ యజమాని పరారీలో ఉండగా.. 26 గంటల పాటు 10 పోలీసు బృందాలు, 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి మరీ పీజీ యజమాని హరిరామ్ భన్సాల్‌ను పోలీసులు రాజస్థాన్ లోని భివాడీ వద్ద అరెస్ట్ చేశారు. ఆపై యజమాని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సీఎం రేఖా గుప్తా ఆదేశాలతో మేజిస్ట్రేట్ విచారణ సాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల భవనం కూలి ఏడుగురు మరణించిన ఘటనలో పోలీసు లు కీలక పురోగతి సాధించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న సదరు భవన యజమాని హరి రామ్ భన్సాల్‌ను రాజస్థాన్‌లోని భివాడీలో అంటే హర్యానా సరిహద్దు సమీపంలో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా 26 గంటలపాటు 10 పోలీసు బృందాలు, 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి మరీ పీజీ యజమానిని అరెస్ట్ చేశారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ సమీపంలో విద్యార్థులకు వసతిగా ఉపయోగిస్తున్న ఈ ఐదంతస్తుల భవనం ఆదివారం మధ్యాహ్నం కూలిపోవడంతో యజ మాని భన్సాల్పై కేసులు నమోదు అయ్యాయి. గుర్గావ్కు చెందిన భన్సాల్‌ను పట్టుకునేందుకు సౌత్ క్యాంపస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫఐఆర్ నమోదు చేసి ప్రత్యేక బృందాల ను రంగంలోకి దించడమే కాకుండా, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. భవన యజమానిపై తీవ్రమైన కేసులు నమోదు చేశారు. హత్యగా పరిగణించని సదోష పూరిత నరహత్య (సెక్షన్ 105), భవన నిర్మాణం లేదా మరమ్మతుల్లో తీవ్ర నిర్లక్ష్యం (సెక్షన్ 290), ఇతరుల ప్రాణాల కు, వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే పనులు చేయడం (సెక్షన్ 125a) కింద కేసులను నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
మరమ్మతులు, తవ్వకాలే కొంపముంచాయా?
‘హాస్టల్ డేజ’ పేరుతో బాలుర పీజీగా కొనసాగుతున్న ఈ భవనంలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థు లు నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో భవనం నేలమట్టమైన సమయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేస్తు న్నారు. దశాబ్దాల నాటి ఈ పాత భవనంలో బేస్మెంట్ వద్ద తవ్వకాలు చేయడం, నీరు నిలిచిపోవడం వల్ల భవనం పునాదుల స్థిరత్వం దెబ్బతిని కూలిపోయిందా అనే కోణంలో ప్రాథమిక విచారణ సాగుతోంది. ఈ ప్రమాదంలో ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఎన్డీఆరఎఫ్, పోలీసులు కలిసి భారీ సహాయక చర్యలు చేపట్టగా ఏడుగురు మరణించారు. ఐదుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఎంసీడీ అధికారుల సస్పెన్షన్
ఈ దుర్ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) భద్రతా లోపాలపై దృష్టి సారించి సౌత్ జోన్‌కు చెందిన ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న భవనాలపై చర్యలు చేపడుతున్నారు.