రాకెట్లు, శాటిలైట్ల తయారీలో ప్రైవేట్ సంస్థలకు ప్రాధాన్యం
Åప్రైవేటీకరణ వార్తలపై ఇస్రో క్లారిటీ
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): ప్రైవేటీకరణకు సంబంధించిన వార్తలపై ఇస్రో క్లారిటీ ఇచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించే ఆలోచన లేదని.. సంస్థ ప్రాధాన్యతను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అయితే రాకెట్లు, సాధారణ ఉపగ్రహాలు, ఇతర వ్యవస్థల భారీ స్థాయి తయారీలో ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మరింత అవకాశాలు కల్పించ నున్నట్లు తెలిపింది. దీనివల్ల ఇస్రో అధునాతన పరిశోధన, మానవ అంతరిక్ష యాత్ర, తదుపరి తరం లాంచ్ సిస్టమ్స్, చంద్రుడు-గ్రహాల అన్వేషణ, వ్యూహాత్మక మిషన్లపై కేంద్రీకరించనుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలకు తెరపడింది. ఇస్రోను ప్రైవేటీకరణపై వస్తు న్న వార్తలన్నీ అవాస్తవమని ఆ సంస్థ ఖండించింది. ఇస్రో ప్రాధాన్య తను తగ్గించే ప్రశ్న లేదని స్పష్టం చేసింది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లు, విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచే సంస్కరణలను ప్రైవేటీకరణగా చూడొద్దని తెలిపింది. ఆదివారం ఇస్రో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఇస్రోకు చెందిన పలు ఉద్యోగ సంఘాలు సంస్థ భవిష్యత్ పాత్రపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇస్రో నిర్వహిస్తున్న రాకెట్లు, శాటిలైట్ల తయారీ, కొన్ని కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థ లు, ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించే ప్రతిపాదన ఉందంటూ వచ్చిన వార్తలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ఈనెల 4న ఇస్రో చైర్మన్ వి.నారాయణన్‌కు లేఖ రాశాయి.
ఉద్యోగుల్లో, వారి కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనకు కారణమైన వార్తలను ప్రస్తావిస్తూ ఇస్రో కీలక వివరణ ఇచ్చింది. ఇస్రో సంస్థను ప్రైవేటీకరించే ఉద్దేశం లేదని.. దాని ప్రాధాన్య తను తగ్గించబోమని తేల్చి చెప్పింది. మన దేశంలో అధునాతన అంతరిక్ష పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, జాతీయ-వ్యూహాత్మక మిషన్లు, అంతరిక్ష శాస్త్రం, గ్రహాల అన్వేషణ, కీలక సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధిలో ఇస్రోనే ప్రధాన సంస్థగా కొనసాగుతుం దని పేర్కొంది. ప్రైవేట్ రంగం విస్తరణ వల్ల ఇస్రో పాత్ర తగ్గదని.. ఇప్పటికే సాంకేతికంగా పరిపక్వత సాధించిన వ్యవస్థలను భారీ స్థాయిలో తయారు చేసే బాధ్యతలను పరిశ్రమలు చేపడితే.. ఇస్రో తన శాస్త్రీయ, సాంకేతిక వనరులను అధునాతన పరిశో ధనలపై కేంద్రీకరించగలదని వివరించింది.
సాంకేతికంగా స్థిరపడిన రాకెట్లు, సాధారణ ఉపగ్రహాలు, ఇతర వ్యవస్థల భారీ ఉత్పత్తిని భవిష్యత్తులో పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ విధానంలో చేపట్టే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది. అయితే దీనివల్ల సంస్థ కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటుందని అర్థం కాదని స్పష్టం చేసింది. ఫ్రాంటియర్ రీసెర్చ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీలు, మానవ సహిత అంతరిక్ష యాత్ర, నెక్స్ట్ జెనరేషన్ లాంచ్ సిస్టమ్స్, చంద్రుడు-ఇతర గ్రహాల అన్వేషణ, జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక సామర్థ్యాల అభి వృద్ధి వంటి అంశాలపై ఇస్రో మరింతగా దృష్టి సారించనుంది.
భారత్ స్పేస్ విజన్ 2047లో భాగంగా 2035 నాటికి భార తీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడం.. 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడం, పునర్వినియోగ లాంచ్ వాహనాలను అభివృద్ధి చేయడం, చంద్రుడు, ఇతర గ్రహాలపై దీర్ఘకాలిక పరిశోధనలు చేపట్టడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. ఇలాంటి ప్రతిష్ఠాత్మక మిషన్లకు అత్యాధునిక పరిశో ధన, ప్రత్యేక శాస్త్రీయ నైపుణ్యం అవసరమని ఇస్రో పేర్కొంది. అందువల్ల టెక్నాలజీలను పరిశ్రమలు విస్తృత స్థాయిలో తయారు చేస్తే.. ఇస్రో తదుపరితరం టెక్నాలజీలపై మరింత దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని వివరించింది.
ఇదే అంశంపై ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్పర్సన్ పవన్ గోయెంకా కూడా స్పందించారు. ఇస్రో ప్రాధాన్యతను తగ్గించే ఉద్దేశం లేదని.. భారత అంతరిక్ష రంగానికి అది పునాదిగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2020 నుంచి చేపడుతున్న అంతరిక్ష రంగ సంస్కరణల ప్రధాన లక్ష్యం దేశ అంతరిక్ష వ్యవస్థను విస్తరిం# áడమేనని పవన్ గోయెంకా తెలిపారు. ప్రైవేట్ పరిశ్రమలు టెక్నాలజీని తయారు చేసి భారీ స్థాయికి తీసుకెళ్లడంతో అంతరిక్ష రంగ సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. 2030 నాటికి ఏడాదికి 50 అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించాలనే లక్ష్యాన్ని సాధించాలంటే ఒకే సంస్థపై ఆధారపడటం సాధ్యం కాదని.. ఇస్రో-ప్రైవేట్ రంగాల మధ్య సహకారం అవసరమని పవన్ గోయెంకా పేర్కొన్నారు.