పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్
4 నెలల కిందట 3.52 ఎకరాలు కొనుగోలు
అక్షర కిరణం, (పిఠాపురం): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ శివారులో మరో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. నాలుగు నెలల కిందట ఇక్కడ 3.52 ఎకరాలు కొనుగోలు చేసిన ఆయన తాజాగా మరికొంత భూమిని కొన్నారు. తాను పిఠాపురం నియోజకవర్గంలోనే శాశ్వత నివాసం ఏర్పరచుకుంటానని జనసేనాని ఎన్నికలకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 13, 28, 29 పరిధిలోని 12 ఎకరాలను పవన్ కొనుగోలు చేశారు. మంగళవారం దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పక్రియను పిఠాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రహస్యంగా పూర్తి చేయిం చారు. పవన్ తరఫున ప్రతినిధిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కొనుగోలు పత్రాలపై సంతకాలు చేసినట్లు చెబుతున్నారు.