నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు
అక్షర కిరణం, (అమరావతి): ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగ బాబు)కు ప్రభుత్వం కేబినెట్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగబాబు జీత భత్యా లు, సిబ్బంది నియామకం, ఇతర ప్రయోజనాలను ఖరారు చేసింది. ఈమేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని పర్యా వరణ, అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.. అలాగే ఆర్థికశాఖ సహా సంబంధిత శాఖలకు సమాచారం అందించారు. నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయన జీత భత్యాలు, సిబ్బంది నియా మకం, ఇతర ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం 2025 జనవరి 10న జారీ చేసిన జీవో నంబర్ 7ను ప్రస్తావించింది.
2025లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 7లో కేబినెట్ హోదా ఉన్నవారికి చెల్లించే జీత భత్యాలు, ఇతర సౌకర్యాలు గురించి క్లియర్‌గా ఉంది. ఈ జీవో ప్రకారమే నాగబాబుకు కూడా జీతాలు, ఇతర సౌకర్యాలు కల్పించ నున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదా పొందిన వారికి జీతం, అలవెన్సుల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రం లో కేబినెట్ హోదా పొందిన వారికి ప్రభుత్వం నెలకు రూ.2 లక్షల జీతం ఇస్తోంది. కేబినెట్ హోదా పొందినవారి ఆఫీస్ కు సంబంధించిన ఫర్నీచర్ ఏర్పాటుకు వన్‌టైం గ్రాంట్.. వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాల కల్పనకు మరో రూ.2.50 లక్షలు చెల్లిస్తారు. జీతంతో పాటు గా అలవెన్స్‌లు కలిపి మొత్తం రూ.4.50 లక్షలు చెల్లిస్తారని జీవోలో ఉంది. కాబట్టి నాగబాబుకు కూడా నెలకు రూ.4.50 లక్షల వరకు జీతం, అలవెన్సులు చెల్లిస్తారనే చర్చ జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలువుర్ని కేబినెట్ హోదాలో నియమించింది. మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కేబినెట్ హోదాలో ఉన్నారు. అలాగే ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు, మంతెన సత్యనారాయణ రాజు, మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావులకు కూడా కేబినెట్ హోదా ఉంది. వీరందరికి జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీవోను జారీ చేసింది. తాజాగా నాగబాబుకు కూడా కేబినెట్ హోదాలో ఇవే జీతభత్యాలు, అలవెన్సులు అందిస్తారు.
ఏపీలో కేబినెట్ హోదా ఉన్నవారిలో చాగంటి కోటేశ్వర రావు, మంతెన సత్యనారాయణ రాజులు ప్రభుత్వం నుంచి వచ్చే జీతం, అలవెన్సులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోనని.. ప్రభుత్వ వాహనం, ఇతర సౌకర్యాలను వినియోగించుకోనని మంతెన సత్యనారాయణ రాజు ప్రకటించారు. చాగంటి కోటేశ్వరరావు కూడా ప్రభుత్వ సలహదారు, కేబినెట్ హోదాలో ఇచ్చే జీతం, అలవెన్సులు తీసుకోనని ప్రకటించారు.