ఓటరు జాబితాలో పేరు కోసం ఆన్లైన్లో చెక్ చేసుకోండి..
అక్షర కిరణం, (అమరావతి): ఏపీలో త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఈక్రమం లోనే ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రజలు ఈ పోర్టల్ సందర్శించి తమ వివరాలను నమోదు చేసి.. ఓటు ఉందో, లేదో తెలుసుకునే వీలుంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈక్రమంలోనే 2025 ఓటర్ల జాబితాతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనేపథ్యంలో 2025 ఓటర్ల జాబితా ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పోర్టల్‌లో ఉంచింది. ఈ పోర్టల్‌ను సందర్శించి ఓటరు జాబితాలో ఓటు ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చనేదీ ఇప్పుడు చూద్దాం.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్ సందర్శించాల్సి ఉంటుంది. బ్రౌజర్లో https://sec-ems.ap.gov.in/apsec/ అని టైప్ చేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఓటర్స్ పోర్టల్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం Search Your Name in Electoral Roll అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ Search by EPIC, Search BY Details అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.
అందులో సెర్చ్ బై ఎపిక్ ఎంచుకోవాలి. ఆ తర్వాత రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ అనే రెండు విభాగాలు ఉంటాయి. అందులో మీరు ఉండే ప్రాంతాన్ని అనుసరించి ఎంపిక చేసుకుంటే.. మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ జిల్లా పేరు, మండలం పేరు ఎంచుకుని ఎపిక్ నంబర్ (ఓటరు కార్డు నంబర్) నమోదు చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓటరు జాబితాలో మీ పేరు ఉంటే ఫోటో, పేరు, బూత్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి. ఏపీ ప్రభుత్వం త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ విధానం ద్వారా మీ ఓటు ఉందో లేదో పరిశీలన చేసుకోవచ్చు.
మరోవైపు ఈ అక్టోబర్, నవంబర్ లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్దేశిత సమయంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసి ఆర్థిక సంఘం నిధులు ఆగిపోకుండా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా పూర్తి చేసింది.