చర్చనీయాంశంగా యూజీసీ నెట్ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల ప్రక్రియ
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతీ ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము నిర్ణయించడంపై అభ్య ర్థుల నుంచి తీవ్ర నిరసనలు, విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉంటే ప్రశ్నించే హక్కు విద్యా ర్థులకు ఉన్నప్పటికీ.. ప్రతీ ప్రశ్నకు ఇంతమొత్తం వసూలు చేయడం అభ్యర్థులపై ఆర్థిక భారంగా మారుతోందని పలు వురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందిస్తూ.. ఫీజు నిర్ణయానికి గల కారణా లను వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అభ్యంతరాలను అరికట్టడానికే ఈ ఫీజు..!
విద్యార్థుల నుంచి వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఎన్టీఏ పూర్తి స్పష్టతను ఇచ్చింది. ఈ ఆన్సర్ కీ ఛాలెంజ్ విధానం పూర్తిగా పారదర్శకంగా, ప్రతీ ఒక్క విద్యార్థికి న్యాయం జరిగేలా రూపొందించబడిందని పేర్కొంది. వ్యాపార కోణంలో గానీ, సంస్థ లాభాల కోసం గానీ ఈ ఫీజును నిర్ణయించలేదని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా, అనవసరమైన, అర్థంలేని అభ్యంతరాలు భారీ స్థాయిలో రాకుండా చూసేందుకే రూ.200 ప్రాసెస్ ఫీజును తీసుకుంటున్నామని వెల్లడించింది.
సమాధానం సరిగ్గా ఉంటే డబ్బులు తిరిగి చెల్లింపు..!
విద్యార్థులు వ్యక్తం చేసే అభ్యంతరాలను ఆయా సబ్జెక్టుల నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఎన్టీఏ తెలిపింది. ఒకవేళ విద్యార్థి లేవనెత్తిన అభ్యంతరం సరైనదేనని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నిర్ధారిస్తే.. వెంటనే ఆ సమాధానాన్ని సవరిస్తారు. ఇలా సవరించిన కొత్త సమాధానం సదరు పరీక్ష రాసిన విద్యార్థులు అందరికీ వర్తిస్తుంది. దీనితో పాటు ఎవరి అభ్యంతరం అయితే సరైనదిగా రుజువవుతుందో, ఆ ప్రశ్నకు సదరు విద్యార్థి చెల్లించిన రూ.200 మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లోకే రీఫండ్ చేస్తామని ఎన్టీఏ హామీ ఇచ్చింది.
సెప్టెంబర్లో రద్దయిన పేపర్లకు రీ-ఎగ్జామ్
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆరఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతలతో పాటు పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్టీఏ ఇటీవల నిర్వహించిన సీఎసఐఆర్-యూజీసీ నెట్ ప్రాథమిక కీను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. జూన్ 22 నుంచి 30 మధ్య మొత్తం 87 వేర్వేరు సబ్జెక్టులలో ఈ పరీక్షలను నిర్వహించారు. అయితే ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో తీవ్ర లోపాలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆయా పరీక్షలను రద్దు చేశారు. రద్దయిన ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించి రాబోయే సెప్టెంబర్ నెలలో మళ్లీ కొత్తగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.