సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమÖత
అక్షర కిరణం, (చెన్నై): దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. ఏడు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి ‘షావుకారు’ జానకి (94) వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1950లో ఎన్టీఆర్ సరసన ‘షావుకారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ చిత్ర విజయంతో ‘షావుకారు జానకి’గా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి అగ్ర తారలందరి సరసన మెప్పించారు. బహుభాషా ప్రావీణ్యం ఉన్న ఆమె తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
భారత చలనచిత్ర జగత్తులో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. ఏడు దశాబ్దాలకు పైగా వెండితెరపై సహజ నటనతో, హుందా తనంతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ నటి పద్మశ్రీ షావుకారు జానకి (94) తుదిశ్వాస విడిచారు. వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మధ్యాహ్నం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈ విషాద వార్త తెలియగానే దక్షిణాది చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది.
రేడియో గళం నుంచి వెండితెర రాణి వరకు
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో 1931 డిసెంబర్ 12న జన్మించిన ఆమె అసలు పేరు శంకరమంచి జానకి., చిన్నతనంలోనే స్పష్టమైన ఉచ్చారణ, అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆకాశవాణి నాటికల ద్వారా కళారంగంలో అడుగుపెట్టారు. 1950లో మహానటుడు ఎన్టీఆర్ సరసన, ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘షావుకారు’ సినిమాతో ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే అసాధారణమైన అభినయాన్ని కనబరిచి, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని ‘షావుకారు జానకి’గా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె సోదరి కృష్ణకుమారి కూడా తెలుగు చిత్రసీమలో మేటి నాయికగా రాణించిన సంగతి తెలిసిందే.
నాలుగు తరాలు.. 400 సినిమాలు
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించిన అరుదైన ఘనత ఆమెది. ఇందులో 200లకు పైగా సినిమాల్లో కథానాయికగానే మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, డాక్టర్ రాజ్‌కుమార్‌ల సరసన నటించి ఆనాటి మేటి తారగా వెలిగారు. తమిళంలో 1952లో ‘వలయపతి’తో అడుగుపెట్టి అక్కడ కూడా అగ్ర తారగా ఎదిగారు. 1959లో డాక్టర్ రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన ‘మహిషాసుర మర్దిని’ కన్నడ చిత్రసీమ తొలి పాన్-ఇండియా చిత్రం గా నిలిచింది. మలయాళంలో ‘స్కూల్ మాస్టర’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. బహుభాషా ప్రావీణ్యం కలిగిన జానకి ఇతర భాషల్లోనూ తన పాత్రలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
చివరి శ్వాస వరకూ కళాసేవ
వెండితెరపైనే కాక, బుల్లితెరపై ‘ఊరరింద రహస్యం’, ‘వరూధిని పరిణయం’ వంటి ధారావాహికల ద్వారా ప్రేక్షకులను అలరించారు. వయసు మీదపడుతున్నా నటనపై ఉన్న మక్కువతో ఇటీవల ‘బిస్కోత’ (తమిళం), ‘అన్నీ మంచి శకునములే’ (తెలుగు) వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి కొత్త తరంతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కళారంగానికి ఆమె అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో ఆమెను ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది.
షావుకారు జానకి భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నై తేనాంపేటలోని సెంటోఫ్ రోడ్డు నివాసంలో ఉంచనున్నారు. నాలుగు తరాల నటీనటులతో ప్రయాణించి, నటనకే వన్నె తెచ్చిన షావుకారు జానకి మృతి పట్ల చిత్ర పరిశ్రమ కన్నీటి నివాళులు అర్పిస్తోంది. ఆమె పోషించిన పాత్రలు తెలుగు-తమిళ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ప్రముఖుల సంతాపం
షావుకారు జానకి మృతిపట్ల స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ‘తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.