వందేమాతరం అన్ని చరణాలు పాడకపోవడం నేరం కాదు
Åసుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
Åవందేమాతరం ఎన్ని చరణాలు పాడాలన్నది పౌరుల వ్యక్తిగతమన్న సర్వోన్నత న్యాయస్థానం
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): జాతీయ గేయం వందేమాతరం ఆలాపనపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వందేమాతరంలోని ఎన్ని చరణాలు పాడాలనేది పౌరుల వ్యక్తిగతమని ఉద్ఘాటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం నిజమైన మతపరమైన అభ్యంతరాలు ఉన్న ఎవరిపైనా అందులోని వివాదాస్పద చరణాలు పాడలేదనే కారణం తో క్రిమినల్ చర్యలు తీసుకోలేరని తేల్చిచెప్పింది. వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను తప్పనిసరిగా ఆలపించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం కింద వందేమాతరా న్ని జాతీయ గీతంతో సమానంగా సవరణ చేస్తూ వెలువరించిన ఉత్తర్వులను ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
కృష్ణ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్.మురళీధర్ వాదనలు వినిపిస్తూ.. ఆరు చరణాలలో నాలుగు చరణాలు స్పష్టంగా హిందూ దేవతలపై భక్తిని ప్రకటిస్తాయని, వాటిని పాడాలని నిర్బంధించడం రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ సవరణ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని, ‘మెజారిటీ మతపరమైన సందేశాన్ని’ ప్రోత్సహిస్తోందని వాదించారు. ‘వారు ‘జాతీయ గేయం’ అనే పదాన్ని ప్రవేశపెట్టారు కానీ, అసలు నేషనల్ సాంగ్ అంటే ఏమిటో చట్టంలో నిర్వచించలేదు. గెజెట్లో కూడా ప్రచురించలేదు.. వారు ఏ చట్టపరమైన నిబంధననూ ఉదహరిం చడం లేదు” అని మురళీధర్ కోర్టుకు విన్నవించారు.
అస్పష్టత ఆధారంగా శిక్షార్హమైన చర్యలు ఉండకూడదని, ప్రజాభిప్రా యాన్ని సేకరించకుండా ప్రభుత్వం చాలా తొందరపాటుతో వ్యవహ రించిందని ఆయన నొక్కిచెప్పారు. సాధారణంగా పాడే రెండు చరణాలకే ఇది పరిమితం కాదని ప్రభుత్వం తప్పనిసరి చేయడాన్ని ఎత్తిచూపుతూ, ‘మీరు బలవంతం చేస్తూ శిక్షార్హమైన చర్యలు తీసుకోలేరని అన్నారు. దీనిపై జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ.. ‘జాతీయ గీతం అంటే ఎప్పుడూ వందేమాతరంగానే భావించారని, జాతీయ ఆకాంక్ష లను కోర్టులు ప్రశ్నించలేవు’ అని వ్యాఖ్యానించారు. ‘ఇది రాజ్యానికి (ప్రభుత్వానికి) చెందిన అంశం. ఒక వ్యక్తి ఒకటి లేదా నాలుగు చరణాలు పాడాలా అనేది ఆ వ్యక్తే నిర్ణయించుకోవచ్చు. దీనిపై శిక్షార్హమైన చర్యలు ఉండవని న్యాయమూర్తి చెప్పారు. చారిత్రాత్మక ‘బిజోయ్ ఇమ్మాన్యుయేల’ కేసులో తీర్పును ప్రస్తావిస్తూ జస్టిస్ బాగ్చీ.. దేశ చట్టమే సర్వోన్నతమైందని, ఆర్టికల్ 25, 26 హక్కులకు భంగం కలుగుతోందని భావించే ఎవరూ కూడా క్రిమినల్ చర్యలకు గురికాకూడదు’ అని పేర్కొన్నారు.
లౌకికవాదం వాదనలపై స్పందిస్తూ.. అమెరికా జాతీయ గీతంలో ‘గాడ’ (దేవుడు) అనే పదం ఉందని, మతపరమైన ధ్వని ఉన్నంత మాత్రాన రాజ్యాంగ లౌకిక స్వభావం దెబ్బతింటుందా? అని జస్టిస్ బాగ్చీ ప్రశ్నించారు. చరిత్ర చదివిన ఎవరికైనా జాతీయ గీతం ఏమిటో తెలుస్తుందని సీజేఐ వ్యాఖ్యానించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం తరఫున వాదిస్తూ.. ‘రాజ్యాంగవాదం అంత సంకుచితంగా ఉండకూడదని వ్యాఖ్యానిస్తూ శాసన ప్రక్రియ ను సమర్థించారు. అయితే, ‘చట్టాల తయారీ నక్సలైట్ల ప్రకారం జరగకూడదని మెహతా వ్యాఖ్యానించడంతో విచారణ తీవ్రరూపం దాల్చింది. దీనిపై పిటిషనర్ తరఫున లాయర్ మురళీధర్ అభ్యంతరం తెలుపుతూ.. వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ, తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడం లేదని సొలిసిటర్ జనరల్ పునరుద్ఘాటించడంతో మురళీధర్ తీవ్ర నిరసన తెలిపారు. శాసన సంబంధ నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలని, ఆయు ధాలు లేదా రాజ్యాంగేతర మార్గాలతో ప్రభావితం కాకూడదన్నదే తన ఉద్దేశమని మెహతా స్పష్టత ఇచ్చారు. ఆ వ్యాఖ్య ను కోర్టు రికార్డుల్లోకి తీసుకోలేదని జస్టిస్ బాగ్చీ పేర్కొంటూ.. ఉగ్రవాదులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా చట్టబద్ధ పాలన (రూల్ ఆఫ్ లా) కిందే విచారిస్తారు కాబట్టే రాజ్యాంగ కోర్టులకు విశ్వసనీయత ఉందని నొక్కి చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరుతూ.. వందేమాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించడాన్ని న్యాయపరంగా ప్రశ్నించలేమని స్పష్టం చేస్తూనే, క్రిమినల్/ శిక్షార్హమైన చర్యలకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తా మని ధర్మాసనం స్పష్టం చేసింది.