పార్టీ కంటే ఎవరూ అతీతులు కాదు... క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
Åటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు
అక్షర కిరణం, (మంగళగిరి): తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణే పార్టీకి అతిపెద్ద బలమని, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పార్టీ లైన్‌కు కట్టుబడి పని చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు అపారమైన విశ్వాసంతో కూటమి ప్రభుత్వానికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు అత్యధిక స్వేచ్ఛ కల్పించే పార్టీ అయినప్పటికీ, ఆ స్వేచ్ఛను పార్టీ ప్రయోజనా లకు విరుద్ధంగా వినియోగించరాదని పల్లా స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించే చర్యలు ఎవరి నుంచైనా వచ్చినా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని పల్లా తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను వినడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు.