విశాఖపట్నం టు పార్వతీపురం కొత్త రైలు
Åదసరా స్పెషల్ రైళ్లు
Åఆగే స్టేషన్లు ఇవే!
అక్షర కిరణం, (విశాఖపట్నం): తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సందడి మొదలైంది.. అక్టోబర్ 10 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు మొదలయ్యాయి. ఆర్టీసీ, రైల్వేలు దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా బస్సులు, రైళ్లను ప్రకటించాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేకంగా రైళ్లను ప్రకటించగా.. ఈ నెల మొదటి వారం నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ఈ రైళ్లు నడుస్తాయి. నవంబర్ నెలలో దీపావళి కూడా ఉండటంతో ప్రత్యేక రైళ్లను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలవారికి రైల్వేశాఖ తీపికబురు చెప్పింది.. ప్రత్యేక రైలును పట్టాలెక్కించబోతున్నట్లు ప్రకటించింది. విశాఖ పట్నం నుంచి పార్వతీపురానికి కొత్త రైలును ప్రకటించారు.
విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి ఈ నెల (అక్టోబర్) 10 నుంచి (అక్టోబర్) 20వ తేదీ వరకు కొత్తగా ప్రత్యేక మెము రైలును ప్రకటించారు. విశాఖపట్నం-పార్వతీపురం-విశాఖపట్నం రైలు షెడ్యూల్, ఆగే స్టేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం టు పార్వతీపురం (07268) మెము రైలు ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మధ్యాహ్నం 12.35 గంటలకు చేరుకుంటుంది. పార్వతీపురం టు విశాఖపట్నం (07267) రైలు మధ్యాహ్నం 12.26 గంటలకు పార్వతీపురంలో బయల్దేరి.. విశాఖపట్నానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది.
విశాఖపట్నం-పార్వతీపురం-విశాఖపట్నం (07268/ 07267) రైలు విశాఖపట్నం, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం, నర్సీపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ కొత్త రైలు దసరాకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది. అంతేకాదు ఈ రైలు ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరుతుంది కాబట్టి.. వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్నం వచ్చే ప్రయాణికులు పార్వతీపురం వెళ్లడానికి వీలుగా ఉంటుందని భావిస్తు న్నారు. కాబట్టి రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఈ మెము రైలు మాత్రమే కాదు ఉత్తరాంధ్ర మీదుగా దసరాకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్‌కు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి.