7 నుంచి ఏపీలో నేతన్న భరోసా పథకం.. ఒక్కొక్కరికీ రూ.25 వేలు..
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమా వేశంలో ‘నేతన్న భరోసా’ పథకానికి ఆమోదం లభించింది. ఈ పథకం కింద అర్హులైన చేనేత కార్మికులకు సంవత్సరా నికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే ఆగస్టు 7న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ముఖ్యంగా 50 ఏళ్లలోపు ఉన్న బీపీఎల్ కుటుంబాలకు చెందిన చేనేత కార్మికులకు ఈ పథకం వర్తించేలా మార్గ దర్శకాలు రూపొందిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల జీవన పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. గతంలో అనర్హులు కూడా సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందిన సందర్భాలు ఉన్నాయని.. ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిజమైన చేనేత కార్మికులకే పథకం ప్రయోజనాలు అందేలా ప్రత్యేక పరిశీలన చేపట్టాలని సూచించారు.
ఇదిలా ఉండగా, కేబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి, సంక్షేమ అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పుష్కరాల నిర్వహణ, విద్యా సంస్థల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
చేనేత రంగానికి ఊతమివ్వడంతో పాటు నేతన్నల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ‘నేతన్న భరోసా’ పథకం కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది చేనేత కార్మికులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.