జూనియర్ డాక్టర్లకు స్టైపెండ్ పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సీనియర్ వైద్యులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్ప టికీ తమ స్టైపెండ్‌ను మాత్రం పెంచడం లేదని జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ స్టైపెండ్ పెంపునకు నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ పూర్తి చేసి ఇంటర్న్‌షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లకు స్టైపెండ్‌ను 10 శాతం పెంచాలని నిర్ణయించారు. అదేసమయంలో పీజీ డిగ్రీ, డిప్లొమా కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థు లకు 5 శాతం పెంపు వర్తించేలా నిర్ణయించారు. సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు 3.5 శాతం చొప్పున పెంచారు. ఇంటర్న్స్, పీజీ మెడిసిన్, సూపర్ స్పెషాలిటీ, ఎండీఎస్, డీఎన్బీ విద్యార్థులకు పెరిగిన స్టైపెండ్ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.
2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన జీవో ప్రకారం ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంటర్న్ హౌస్ సర్జన్లకు నెలకు రూ.25,906 స్టైఫండ్ లభిస్తోంది. పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.60,823, రెండో ఏడాది రూ.61,528, మూడో ఏడాది రూ.64,767 చొప్పున ఉంది. సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు కోర్సు సంవత్సరాన్ని బట్టి రూ.80,500 నుంచి రూ.85,100 వరకు స్టైపెండ్ ఉంది. 2026 జనవరి 1న మరో పీరియాడిక్ రివిజన్ రావాల్సి ఉండగా అది ఆలస్యం కావడంతో జూడాలు ఆందోళనకు దిగారు. దీంతో తాజాగా స్టైఫండ్ పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా 9,501 మంది ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంటర్న్స్, పీజీ, సూపర్ స్పెషాలిటీ, ఎండీఎస్, డీఎన్బీ తదితర శిక్షణలో ఉన్న వారికి స్టైపెండ్ అందుకోనున్నారు. వీరికి ప్రభుత్వం ప్రస్తుతం నెలకు సుమారు రూ.48.84 కోట్లు, ఏడాదికి రూ.586.08 కోట్లు ఖర్చు చేస్తోంది. తాజా పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.34 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, ప్రభుత్వ బోధనాసుపత్రులు, జనరల్ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు రోజువారీ వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓపీ సేవలు, వార్డులు, అత్యవసర విభాగాలు, ఐసీయూలు, లేబర్ రూమ్‌లు, అత్యవసర శస్త్రచికిత్సలు, ట్రామా కేసులు, రాత్రి వేళ క్యాజువాల్టీ సేవల్లో వీరి విధులు ముఖ్యమైనవి. జూడాల సమస్య కేవలం స్టైపెండ్ పెంపుతోనే పరిమితం కాలేదు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టడం, సీనియర్ వైద్యుల పదవీ విరమణ వయసు పెంపుపై అభ్యంతరాలు వంటి అంశాలను కూడా APజీUణA ప్రస్తావించింది. ఈ అంశాలపై సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భవిష్యత్తులో స్టైపెండ్ సవరణలను నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేయడం, డాక్టర్ల పనిభారం-శిక్షణ అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలపై కూడా తగిన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది.