ఆపరేషన్ సిందూర్ సహా పాకిస్తాన్‌కు పలు కీలక రహస్యాలు
నేవీ హెడ్‌క్వార్టర్స్ ఉద్యోగి విశాల్ యాదవ్ అరెస్టు
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): ఢల్లీిలోని నేవీ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న విశాల్ యాదవ్ అనే ఉద్యోగి పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ పోలీసులకు చిక్కాడు. రాజస్థాన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విశాల్ యాదవ్ చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి సమాచారం చేరవేస్తున్నాడని తేలింది. అంతేకాకుండా భారత్ ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన సమాచా రాన్ని కూడా అతడు దాయాదికి చేరవేసినట్టు నిర్దారిం చారు. హర్యానాకు చెందిన విశాల్ యాదవ్ ఢల్లీిలోని నేవల్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో అతడి అనుమానాస్పద కార్యకలాపాలను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని ఢల్లీిలో అదుపులోకి తీసుకున్నారు.
అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, భారత నేవీకి సంబంధించిన చాలా ముఖ్యమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన ఒక మహిళకు చేరవేసినట్లు గుర్తించారు. డబ్బులు తీసుకొని ఆ సమాచారం ఆమెకు ఇచ్చినట్లు తేలింది. రాజస్థాన్ సీఐడీ ఐజీ విష్ణుకాంత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. విశాల్.. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ చెందిన ఒక మహిళతో సోషల్ మీడియాలో తరుచూ మాట్లాడుతూ ఉండేవాడు. ప్రియా శర్మ అనే పేరు తో పరిచయమైన ఆ పాకిస్థాన్ మహిళ, విశాల్‌కు డబ్బు ఆశ చూపి రహస్య సమాచారం తీసుకుంది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై డబ్బులు పోగొట్టుకున్న విశాల్ యాదవ్.. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇలా దేశ రహస్యాలను చేరవేస్తున్నాడని విష్ణుకాంత్ తెలిపారు. క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లు, బ్యాంకు ఖాతాలతో అతడ డబ్బు తీసుకున్నట్లు గుర్తించామన్నారు.
విశాల్ యాదవ్‌ను అరెస్టు చేసి జైపూర్‌లో కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రాజస్థాన్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ గూఢ చర్యంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో, ఎలాంటి సమా చారం చేరవేశాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘సోషల్ మీడియాలో ఇలాంటి కార్యకలాపాలు అధికమవు తోన్న నేపథ్యంలో అనుమానాస్పద చర్యలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండి, వెంటనే సమాచారం అందజేయాలని సెక్యూరిటీ ఏజెన్సీలు విజ్ఞప్తి చేశాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు గూఢచర్యం చేశారనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐఎస్ఐ ఏజెంట్‌తో ఆమెకు సంబంధాలున్నట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, ఆమె పాకిస్థాన్‌లో పర్యటించి... అక్కడ ఉన్నతాధికారులతో సమావేశాల్లోనూ పాల్గొన్నట్టు కథనాలు వచ్చాయి. అలాగే, పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఆమె ఆ ప్రాంతంలో వీడియోలు చేయడం అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆమెతో పాటు మరికొందర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా పాకిస్థాన్‌కు సైనిక రహస్యాలను చేరవేసినట్టు అనుమానిస్తున్నారు.