మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న నందికేశ్వర శైవక్షేత్రాలు
అక్షర కిరణం, (పలాస): మహాశివరాత్రి సందర్భంగా పలాస నియోజకవర్గంలో చారిత్రక శివాలయాలు శివ నామస్మరణతో మారుమోగనున్నాయి. ఈనెల 26న మహా శివరాత్రి సందర్భంగా వజ్రపుకొత్తూరు మండలం బెండి నంది కేశ్వర ఆలయం, అక్కుపల్లి శివసాగర్ బీచ్ రోడ్, కాశీబుగ్గ పెంటవీధి, పలాస పురుషోత్తపురం తదితర ఆలయాలలో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఆలయంలో ఎపుగా పెరిగిన చెట్టులను, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మహా శివరాత్రి పురస్కరించుకొని ఆయా ఆలయాలలో ప్రత్యేక పూజలు, ఉదయం ఆరు నుండి మరుసటి రోజు ఆరు గంటల వరకు శివనామ స్మరణతో భజనలు నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు కాశీబుగ్గ పెంటవీధి పురాతన కాశీవిశ్వేశ్వర ఆలయంలో లక్ష దీపారాధన నిర్వహించనున్నట్లు పూజారులు చెప్పారు. బెండి నందికేశ్వర ఆలయంలో రాత్రి 12.30 గంటల నుండి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పూజలు ప్రారంభం కానున్నాయని, ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి శివపార్వతి ఉత్సవ విగ్రహాలతో గ్రామంలో ఊరేగింపు ఉంటుందని పూజారులు తెలిపారు.