ప్రతిభావంతులకు ‘సైనింగ్ స్టార్స’ పురస్కారాలు ప్రదానం చేసిన మంత్రి కొండపల్లి
అక్షర కిరణం, (శ్రీకాకుళం): నేటి విజేతలు.. రేపటి దేశ భవిష్యత్తు!” అని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఆనందమయి కన్వెన్షన్ హాల్లో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్యా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం ‘ఫెలిసిటేటింగ్ షైనింగ్ స్టార్స్-2026’ పురస్కారాల ప్రదానో త్సవం నిర్వహించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సభాధ్యక్షత వహించిన వేడుకలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి చెక్కులు, మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యా ఫలితాల్లో గతంలో రాష్ట్రంలో 14వ స్థానంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా, నేడు 5వ స్థానానికి చేరుకోవడం మన విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉత్తీర్ణత గతంలోని 78.29 శాతం నుండి 88.07 శాతానికి అంటే దాదాపు 10 శాతం పెరిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల నుండి ‘సైనింగ్ స్టార్స’ పురస్కారాలు సాధించిన విద్యార్థుల సంఖ్య 88 నుండి 106 కి పెరిగిందని, ఈసారి అవార్డులు సాధించిన వారిలో 66 శాతం మంది బాలికలే ఉండటం విశేషమని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వర రావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, సత్కార గ్రహీతలు విద్యార్థులు సింహాద్రి హాసిని, శృతి, గోవిందరాజు, యామిని, జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ విఠల్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, రమేష్, పీఎంజే బాబు, అధికారులు పాల్గొన్నారు.