స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అస్వస్థత
అక్షర కిరణం, (తిరుపతి): తిరుపతిలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించే సమయంలో.. బీపీ డౌన్ అయ్యి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. అయితే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది.. ఆనం కింద పడకుండా పట్టుకున్నారు. అనంతరం వైద్యులు ప్రాథమిక వైద్య చికిత్స అందించారు. అయితే తీవ్రమైన ఎండ, బీపీ తక్కువ కావటం వలన కొద్దిగా నీరసానికి గురైనట్లు మంత్రి ఆనం ప్రకటన విడుదల చేశారు.
తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానంలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఆనం రామనారాయణరెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి పక్కకు వాలిపోయారు. పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది.. వెంటనే అప్రమత్తమై ఆనం రామనారాయణరెడ్డిని కింద పడకుండా పట్టుకున్నారు. వైద్యులు వెంటనే ప్రాథమిక చికిత్స అందజేశారు. కొద్దిసేపటి తర్వాత మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తిరిగి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ప్రసంగాన్ని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు పూర్తి చేశారు.
ఆనం రామనారాయణరెడ్డి ప్రకటన..
కాగా తన అస్వస్థత గురించి ఆందోళన అవసరం లేదని కొద్దిసేపటి తర్వాత మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటన విడుదల చేశారు. తీవ్రమైన ఎండ, లోబీపీ కారణంగా కొద్దిగా నీరసానికి గురైనట్లు ట్వీట్ చేశారు.
“ఈరోజు తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రసంగిస్తున్న సమయంలో తీవ్రమైన ఎండ, స్వల్పంగా బీపీ తగ్గడం వల్ల కొద్దిసేపు నీరసానికి గురయ్యాను. వెంటనే వైద్య బృందం ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యం పూర్తి నిలకడగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవీకరించారు. అనంతరం అధికారిక కార్యక్రమాల్లో ఎప్పటిలాగే యథావిధిగా పాల్గొన్నాను. నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది, యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఫోన్ చేసి ఆరా తీసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను పూర్తి ఆరోగ్యంతో, ఉత్సాహంగా ఉన్నానని అందరికీ తెలియజేస్తున్నాను.” అంటూ మంత్రి ఆనం రామనారా యణరెడ్డి సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు.