అన్ కాల్ ఆర్టీసీ డ్రైవర్లను ఆదుకోవాలంటూ మంత్రి సంధ్యారాణికి వినతి
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న అన్‌కాల్ డ్రైవర్లను ఆదుకోవాలని స్త్రీ శిశుసంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఆర్టీసీ డ్రైవర్లు బుధవారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. మంత్రి సంధ్యారాణి ని అన్ కాల్ డ్రైవర్లు కలిసి తమ గోడును విన్నవించారు.
సాలూరు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న అన్ కాల్ డ్రైవర్స్‌ని సింగిల్డ్యూటీ చేయించాలని, డ్యూటీలు ఒకరోజు ముందు గా తెలియజేయాలని కోరారు. ఆర్టీసీని చాలా ఏళ్లుగా నమ్ముకుని ఉన్నామని, ఇక్కడ వారిని కాదని, కొత్త వారితో పనిచేయించవద్దని కోరారు. డ్యూటీలు వేయడం లో పక్షపాత ధోరణి అవలంబించవద్దని కోరారు. అనివార్య కారణాల వలన కిలోమీటర్లు డ్యూటీ తగ్గితే వేతనాల్లో కోతలు వేయవద్దని వేడుకున్నారు. ట్రాఫిక్ జాము రిపేర్ల సమస్యలను అర్థం చేసుకోవాలని కోరారు. డిపోను నమ్ముకున్న పాతవారికే అధిక ప్రాధాన్యం ఇచ్చి ఐడీ కార్డులు అందజేయాలన్నారు. వీరి సమస్యలపై మంత్రి సంధ్యారాణి సానుకూలంగా స్పందించారు. డిపోమేనేజర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సాలూరు డిపో అన్‌కాల్ డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.