బీజేపీకి గట్టి షాక్.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా రాజీనామా
వ్యక్తిగత కారణాలతో వైదొలగినట్టు వార్తలు!
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): భారతీయ జనతా పార్టీ కి మరో గట్టి షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న షెహజాద్ పూనావాలా ఆ పదవికి రాజీనామా చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారని, ఇప్పటికే రాజీనామా పత్రాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘకాలంగా బీజేపీ తరఫున గళం వినిపిస్తూ.. ప్రతిపక్షాలపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకు పడే పూనావాలా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకమైన అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఈ రాజీనామాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.
సోషల్ మీడియా ఖాతా బయోలో కీలక మార్పులు..
రాజీనామా ప్రచారం నడుమ షెహజాద్ పూనావాలా తన అధికారిక ఎక్స్ ఖాతా బయో వివరాలను సవరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా అప్డేట్ చేసిన తన బయోలో నరేంద్ర మోదీకి ‘జీవితాంతం అనుచరుడిని’ అని పేర్కొన్నారే తప్ప.. ఎక్కడా బీజేపీ పార్టీ పేరును ప్రస్తావించక పోవడం గమనార్హం. ఒకవైపు ‘ఎక్స’ ప్రొఫైల్‌లో మార్పులు చేసినప్పటికీ.. ఆయన ఇన్స్టాగ్రామ్ బయోలో మాత్రం ఇప్పటికీ ‘ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ‘ అనే వివరాలే దర్శనం ఇస్తున్నాయి.
కాంగ్రెస్‌తో కెరియర్ స్టార్ట్.. తిరుగుబాటుతో బీజేపీలోకి!
వృత్తిరీత్యా న్యాయవాది, పౌర హక్కుల ఉద్యమకర్త అయిన షెహజాద్ పూనావాలా తన రాజకీ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తో ప్రారంభించారు. అయితే 2017లో ఆ పార్టీ అంతర్గత ఎన్నికల విధానంపై బహిరంగంగా తిరుగుబాటు జెండా ఎగరేసి జాతీయస్థాయి దృష్టిని ఆకర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు నిర్వహించిన అంతర్గత ఎన్నికల ప్రక్రియ అంతా ముందస్తు గా సిద్ధం చేసిన నాటకం అని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ తిరుగుబాటు పరిణామాల తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు, ఆయన సొంత సోదరుడు తెహసీన్ పూనావాలా సహా ఇతర కుటుంబ సభ్యులు కూడా షెహజాద్‌కు బహిరంగంగా దూరం జరిగారు.
దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. సమాజంలో అనేక కీలక అంశాలు, రాజకీయ విషయాలపై పార్టీ తరఫున బలమైన వాదనలు వినిపించే నైపుణ్యం ఉండటంతో బీజేపీ అధిష్ఠానం ఆయన్ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ విధానాలను టీవీ చర్చల్లో ధీటుగా సమర్థించే పూనావాలా హఠాత్తుగా వైదొలగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.