శబరిమలలో భక్తుల రద్దీ వేళ కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు..
కఅయ్యప్ప దర్శనాలపై ఆంక్షలు
అక్షర కిరణం, (శబరిమల/జాతీయం): శబరిమలలో మండల, మకరవిళక్కు వార్షిక పూజల కోసం ఈనెల 16వ తేదీన సాయంత్రం రోజున అయ్యప్ప సన్నిధానంలో భక్తులకు దర్శనాలకు ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అనుమతించింది. దీంతో లక్షలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తడంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. అయ్యప్ప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా లక్షల మంది శబరిమలకు చేరుకోవడంతో.. శబరి గిరులు భక్తులతో కిక్కిరిసి పోతున్నాయి. దీంతో భారీగా తరలివస్తున్న భక్తులను కంట్రోల్ చేయడం.. అటు పోలీసులకు.. ఇటు టీడీబీ అధికారులకు తలకుమించిన భారంగా మారుతోంది. మరోవైపు.. కిలోమీటర్ల మేర క్యూ లైన్లు నిండిపోవడంతో గంటల తరబడి అయ్యప్ప భక్తు లు అవస్థలు పడుతున్నారు. భక్తుల రద్దీ పెరిగిపోవ డంతో తొక్కిసలాట వంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ క్యూ లైన్లలోనే ఇటీవల ఓ 58 ఏళ్ల మహిళ కుప్పకూలి మరణిం చడం తీవ్ర సంచలనంగా మారింది. ఈనేపథ్యంలోనే శబరిమలలో కొన సాగుతున్న భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు జోక్యం చేసుకుంది. శబరి మలకు వచ్చే భక్తులకు సంబం ధించి చేసిన ఏర్పాట్లపై టీడీబీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్న కేరళ హైకోర్టు.. భక్తుల భద్రత, వారికి సజావుగా అయ్యప్ప దర్శనం జరిగేలా చూసేందుకు రోజువారీ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై పరిమితిని సవరించింది. వర్చువల్ క్యూ వ్యవస్థతో రోజుకు గరిష్టం గా 70 వేల మంది భక్తులను మాత్రమే దర్శనం కల్పించాలని హై కోర్టు టీడీబీకి ఆదేశాలు జారీ చేసింది.
అదే సమయంలో ఈ70 వేల మంది భక్తులకు అదనంగా.. శబరి మలలో స్పాట్ బుకింగ్ చేసుకునే భక్తులలో రోజుకు 5 వేల మందిని అనుమతించాలని పేర్కొంది. తాజాగా ఇచ్చిన ఈఆదేశాలు నవంబర్ 24వ తేదీ వరకు అమలులో ఉంటాయని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు పతనంతిట్ట జిల్లా ఎస్పీ ఆనంద్ రాజగురు స్పందించారు. శబరిమల దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా ఆ రోజుకు సంబంధించిన వర్చువల్ క్యూ పాస్ లేదా స్పాట్ బుకింగ్ పాస్ కలిగి ఉండాలని తేల్చి చెప్పారు. ఈ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే నీలక్కల్ నుంచి.. పంబ మీదుగా సన్నిధానం వరకు ముందుకు వెళ్లడానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇక స్పాట్ బుకింగ్ పాస్‌ల కోసం.. నీలక్కల్తోపాటు.. వండిపెరియార్ సత్రం, ఎరుమేలి, చెంగన్నూరులలోని సెంటర్లలో సంప్రదించవచ్చని వెల్లడిరచారు. స్పాట్ బుకింగ్ హెచ్చరిక
స్పాట్ బుకింగ్‌ను ఆశ్రయించే భక్తులు కేవలం నీలక్కల్ కేంద్రంపైనే పూర్తిగా ఆధారపడకూడదని అధికారులు సూచించారు. రోజువారీ కోటా త్వరగా నిండిపోయే అవకాశం ఉందని.. అందుకే మిగిలిన ప్రాంతాల్లో కూడా పాస్‌లు తీసుకోవచ్చని తెలిపారు. భక్తులకు సురక్షి తమైన, క్రమబద్ధమైన యాత్ర కోసం నీలక్కల్, పంబ, సన్నిధానం వద్ద పోలీసులు, భద్రతా సిబ్బంది జారీ చేసిన సూచనలను పాటించాల ని.. భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని కోరారు. మండల%-%మకరవిళక్కు సీజన్ సమయంలో శబరిమల సహాయం కోసం కేరళ లోపల ఉన్న భక్తులు 14432 నంబర్‌ను.. కేరళ వెలుపల ఉన్నవారు 04735-14432 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.