ఉత్తరాంధ్ర భూమికి రావడం గర్వంగా భావిస్తున్నా
భోగాపురం ఏయిర్పోర్టు ప్రారంభోత్సవ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
అక్షర కిరణం, (భోగాపురం): పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
శనివారం విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రా యువత ఉజ్వల భవిష్యత్తుకు ఇదో లాంచ్ ప్యాడ్ అన్నారు. చంద్రబాబు విజన్‌కు అభినందనలు తెలిపారు.. ఒకేసారి 13వేల మంది గిరిజన మహిళల నృత్యం నిజంగా అద్భుతమన్నారు. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించిందన్నారు. అదేవిధంగా సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు తెలిపారు. ఉత్రరాంధ్ర భూమికి రావడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
ఉత్రరాంధ్ర సరికొత్త చరిత్రకు నాంది: చంద్రబాబు
ఈసందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో సరికొత్త చరిత్రకు నాంది పలికాం అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు.. ఉత్తరాంధ్రకు మణిహారమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని.. కొత్త చరిత్రకు నాంది పడిందన్నారు. భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకు నేందుకు చాలా మంది ప్రయత్నించారని.. ఉత్తరాంధ్రను అవహేళన చేసినవారు.. అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారన్నారు. వాటిని అధిగమించి ఎయిర్‌పోర్టు నిర్మించుకోవడం అందరికీ గర్వకారణమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం: పవన్ కళ్యాణ్
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్‌పోర్టు సరికొత్త అధ్యాయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో వేగంగా నడిపిస్తోన్న నేత.. మోదీ అంటూ ప్రశంసించారు. ప్రధాని మోదీ 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్నారని.. ఈ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారన్నారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఏపీ.. అగ్రగామి రాష్ట్రంగా మారబోతోందని కొనియాడారు.
ఎర్రబస్సు రాదన్న చోటుకి ఎయిర్‌పోర్టు వచ్చింది: మంత్రి లోకేష్
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఇచ్చారన్నారు మంత్రి నారా లోకేష్. ఎర్ర బస్సు రాదన్న చోట.. ఎయిర్‌పోర్టు వచ్చిందన్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి పేరు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని పూర్తి సహకారం అందిస్తున్నారని.. ఈ ఎయిర్‌పోర్టుకు ఏపీ పవర్ ఇంజిన్‌గా మారబోతోందన్నారు. శరవేగంగా విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్థకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తర ద్వారం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఉత్తరాంధ్ర ప్రజలకు భోగాపురం ఎయిర్‌పోర్టు సింహద్వారమని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుతో ప్రపంచం చూపు ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నారు. ఎర్ర బస్సు కూడా తిరగని ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట అవసరమా అని హేళన చేశారని.. ఇప్పుడు ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగబోతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ ఎయిర్పోర్ట్ ఉత్తర ద్వారంలా మారిందని రామ్మోహన్ నాయుడు ఈసందర్భంగా స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
కాగా మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని..ఉత్తరాంధ్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు అని అన్నారు. ఏపీ అభివృద్ధిని ప్రధాని మోదీ తన భుజాలపై ఎత్తుకున్నారని కొనియాడారు. ఉత్తరాంధ్ర ఉత్పత్తులను ఇకపై నేరుగా విదేశాలకు ఎగుమతి చేయొచ్చన్నారు. మోదీ వచ్చాక విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగిందన్నారు. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇదొక కీలక మైలు రాయన్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటుగా గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేషే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు మురళీధర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జి.మల్లికార్జున రావు, జీఎంఆర్ గ్రూపు బిజినెస్ ఛైర్మన్ జీబీఎస్ రాజులు ఉన్నారు. అనంతరం టెర్మినల్ భవనం ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. విమానాశ్రయంలో ప్రత్యేకతలను ప్రధాని మోదీకి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు వివరించారు.