భోగాపురం విమానాశ్రయం జాతికి అంకితం
Åరూ.17,912 కోట్ల పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం
అక్షర కిరణం, (విజయనగరం): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727కోట్లతో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం’ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రులు వేదికను పంచుకున్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంతోపాటు రాష్ట్రంలో మొత్తం రూ.17,912 కోట్ల అంచనాతో నిర్మించనున్న పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్‌గా నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ జిల్లా తర్లువాడ వద్ద రూ.468 కోట్లతో నిర్మించనున్న ‘ఏఎసఐపీ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టెస్టింగ్ ఫెసిలిటీ (ఫేజ్-1)’కి ప్రధాని శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తూ కర్నూలు-4 ఆర్ ఈ జెడ్ (4.5 గిగా వాట్స్) ట్రాన్స్మిషన్ సిస్టమ్‌కు రూ.5,550 కోట్లతో పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కర్నూలు సోలార్/విండ్ ఎనర్జీ జోన్ (రూ.3,547 కోట్లు), అనంతపురం, కర్నూలు పరిధిలోని సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ స్కీమ్ (రూ.823 కోట్లు)లను ప్రధాని మోదీ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రూ.763 కోట్ల వ్యయంతో పూర్తయిన ప్యాకేజీ-4 (రెచర్ల - గుర్వాయగూడెం) లోకార్పణతో పాటు రూ.933 కోట్లతో చేపట్టే ప్యాకేజీ-5 (గుర్వాయగూడెం - దేవరాపల్లి)కి శ్రీకారం చుట్టారు. రూ.160 కోట్లతో 4-లేన్ల రహదారి నిర్మాణానికి, పెంచలకోన వద్ద లో-లెవెల్ వంతెన స్థానంలో రూ.27 కోట్లతో హై-లెవెల్ వంతెన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.