టీటీడీ సీవీఎస్వోగా కేవీ మురళీకృష్ణ బాధ్యతల స్వీకారం
అక్షర కిరణం, (తిరుమల): తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్వో)గా కేవీ మురళీకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత సీవీఎస్వో రంగనాయకులు మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సీవీఎస్వో కేవీ మురళీకృష్ణకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈకార్యక్రమంలో టీటీడీ అడిషనల్ సీవీఎస్వో వెంకట శివకుమార్ రెడ్డి, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్య మంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు ధనవ్యాధాలు తెలిపారు మురళీకృష్ణ. తిరుమలలో గతంలో డీఎస్పీ, ఏఎస్పీగా విధులు నిర్వహించానని.. ఇది తనకు ఎంతగానో దోహద పడుతుందన్నారు. టీటీడీ ముఖ్య అధికారులు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా తన బాధ్యత నిర్వహిస్తానన్నారు. టీటీడీలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిబద్ధతతో పని చేస్తానన్నారు. టెక్నాలజీ పరంగా మరింత మెరుగ్గా ముందుకు వెళ్లేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తామ న్నారు. తిరుమలలో భద్రతా ప్రమాణాలు మరింత మెరుగవు తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దళారి వ్యవస్థను అరికట్టే విధంగా పటిష్ఠమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మురళీకృష్ణ 2011లో గ్రూప్స్ రాసి డీఎస్పీ అయ్యారు.. గతంలో ఆయన డీఎస్పీగా తిరుపతి, తిరుమలలో పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ దక్కిన తర్వాత తిరుమలలో విధులు నిర్వహించారు.. అక్కేడే ఎస్పీగా ప్రమోషన్ దక్కింది. అనంతరం తిరుపతి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మొన్నటి వరకు విశాఖ పట్నంలో ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేశారు. ఆయనకు తిరుపతి, తిరుమలలో పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయనకు టీటీడీ సీవీఎస్వోగా బాధ్యతలు అప్పగించారు.