విశాఖలో 4 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్టోన్ ఫెస్ట్
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం మరో అంతర్జాతీయ వేడుకకు సిద్దమవుతోంది. దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ స్టోన్ ఫెస్ట్ 2026 జరగ నుంది. డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఈ స్టోన్ ఫెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు.
అసలు ఈ ‘స్టోన్ ఫెస్ట’ అంటే ఏంటి...?
ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ స్టోన్ ఫెస్ట్ జరుగుతుంది. ఇందులో 144కుపైగా వ్యాపార స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి లభించే సహజ రాతి, విలువైన ఖనిజాల ప్రదర్శనే ఈ స్టోన్ ఫెస్ట్. నాణ్యమైన గ్రానైట్, మార్బుల్, సున్నపురాయి, క్వార్ట్జైట్, ఇసుకరాయి, టైల్స్‌తోపాటు క్వారీయింగ్, కటింగ్, పాలిషింగ్ యంత్రాలు, డైమండ్ టూల్స్ అన్నీ ఒకే వేదికపై కొలువుదీరనున్నాయి.
స్టోన్ ఫెస్ట్ ముఖ్య ఉద్దేశం?
వ్యాపార సహకారం, పెట్టుబడి అవకాశాలు ప్రోత్సహించ డమే ఈ స్టోన్ ఫెస్ట్ ముఖ్య ఉద్దేశం. దేశ విదేశాల నుంచి 8 వేల మంది వ్యాపారులు, కొనుగోలుదారులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. రాళ్లు, ఖనిజాల ప్రదర్శనతో పాటు సెమినార్లు, వాణిజ్య సమావేశాలు, ఇంట్రాక్షన్స్, నెట్ వర్కింగ్ అవకాశాలు కూడా ఉంటాయని అవగాహన కోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.